బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణలో భారీవర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ, అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ రిపోర్టులో వెల్లడించింది.;

Update: 2025-09-02 06:53 GMT
ఐఎండీ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర–తూర్పు బంగాళాఖాతం ఆనుకుని ఉన్న మయన్మార్ తీరప్రాంతంపై ఉన్న ఎగువ గాలుల చక్రవాత ఆవలంబన ప్రభావంతో అల్ప పీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అనంతరం తదుపరి 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదలే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.


తెలంగాణలో అతి భారీ వర్షాలు
తెలంగాణలోని 13 జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.భద్రాద్రి కొత్తగూడెం,హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు,నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు.



 11 జిల్లాల్లో భారీవర్షాలు

తెలంగాణలోని 11 జిల్లాల్లో మంగళవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.రాష్ట్రంలోని ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి,సూర్యాపేట, సిద్ధిపేట, సంగారెడ్డి, నల్గోండ,.మెదక్, మంచిర్యాల జిల్లాల్లో బారీవర్షాలతోపాటు ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని ఆయన తెలిపారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. గంటల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి,నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ రిపోర్టులో పేర్కొంది.

పలు జిల్లాల్లో భారీవర్షాలు
సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది.ఆదిలాబాద్ రూరల్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద 103 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని 56 మండలాల్లో 40.0 మిల్లీమీటర్ల నుంచి 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, ములుగు, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు.


Tags:    

Similar News