Mahesh Kumar Goud | ‘అదానీపై జేపీసీ ద్వారా విచారణ జరిపించాలి’
అదానీ అరెస్ట్ అయితే.. ప్రధాని మోదీ రాజీనామా చేయాల్సి వస్తుందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గౌతమ్ అదానీ(Gautam Adani) అవినీతి అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదానీ అరెస్ట్ అయితే.. ప్రధాని మోదీ(PM Modi) రాజీనామా చేయాల్సి వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని అండతో అదానీ అడ్డు అదుపు లేకుండా వేల కోట్లు దండుకున్నారని, ఇప్పుడు అతడు అరెస్ట్ అయితే ప్రధానికి పదవి గండం తప్పదని జోస్యం చెప్పారు. అంతేకాకుండా అదానీతో చేసుకున్న ఒప్పందాలపై కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉందని వివరించారు. ఏ ఒప్పందమైనా ఇల్లీగల్‌గా ఉంటే దానిని రద్దు చేస్తామని, సరిగా ఉన్న ఒప్పందాలనే కొనసాగిస్తామని చెప్పారు.
అదానీనీ తక్షణమే అరెస్ట్ చేయాలి
‘‘అదానీని అరెస్ట్ చేస్తే ప్రధాని మోడీ రాజీనామా చేయక తప్పదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ(Ambani) లాంటి బడా పెత్తందారులని పెంచి పోషిస్తుందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆనాడే చెప్పాడు. సెబీ ఛైర్మన్ మాధవి బుచ్ అదానీకి లాభం చేకూర్చింది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే మోడీ రాజీనామా చేయాల్సి వస్తుంది. ప్రధాని అండతో అదానీ గ్రూప్ విచ్చలవిడిగా సంపద పెంచుకున్నారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలి. పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి విచారణ జరపాలి. జేపీసీలో ఎవరు దోషులుగా తేలినా శిక్షించాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.
కేటీఆర్ కూడా విరాళం ఇవ్వొచ్చు
‘‘అదానీ రూ.100 కోట్ల విరాళం స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటికి కాదు. కావాలంటే కేటీఆర్(KTR) కూడా ఒక రూ.50 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇవ్బొచ్చు. దానికి ఎవరూ అడ్డు చెప్పరు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరిగితే ఎంతో మేలు చేకూరుతుంది. యువత తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి సులభమైన మార్గం ఏర్పడుతుంది. ఇందులో కూడా కేటీఆర్‌కు అవినీతే కనిపించడం మన దౌర్భాగ్యం’’ అని విమర్శించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా మహేష్ కుమార్ స్పందించారు.
త్వరలోనే మరిన్ని చేరికలు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని మహేష్ కుమార్ చెప్పారు. దాంతో పాటుగానే అతి త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ పార్టీలో చేరడానికి వాళ్లు ఆసక్తి చూపుతున్నారని, ఫోన్‌లో టచ్‌లో కూడా ఉన్నారని వివరించారు. ‘‘త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి. కేటీఆర్‌తో తిరుగుతున్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు పోయినా న్యాయమే జరుగుతుంది. మేము చేసిన మంచి పనులు చూసి ఎమ్మెల్యేలు మా వైపు వస్తున్నారు. ఎంతమంది టచ్‌లో ఉన్నారనేది త్వరలోనే మీకు తెలుస్తుంది’’ అని వెల్లడించారు.