భూముల పరిరక్షణ గురించి బీఆర్ఎస్సా మాట్లాడుతుంది: మహేష్ కుమార్

బీఆర్ఎస్ ప్రభుత్వం వేల ఎకరాల భూములను తెగనమ్మిందని, తన వాళ్లకు కట్టబెట్టిందని ఆరోపించారాయన. తన వారు అడగడం ఆలస్యం ఆ భూమి విస్తీర్ణం ఎంత ఉన్నా ఇచ్చేశారంటూ విమర్శలు గుప్పించారు.;

Update: 2025-04-11 12:27 GMT

కంచె గచ్చిబౌలి భూవివాదం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీస్తోంది. ఈ అంశంపై ఇరు పక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ భూముల వివాదం వెనక రూ.10వేల కోట్ల కుట్ర ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమాధానం ఇచ్చారు. భూముల పరిరక్షణ గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లెవేస్తున్నట్లు ఉందంటూ చురకలంటించారు. పదేళ్ల పాటు కొనసాగించిన పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల ఎకరాల భూములను తెగనమ్మిందని, తన వాళ్లకు కట్టబెట్టిందని ఆరోపించారాయన. తన వారు అడగడం ఆలస్యం ఆ భూమి విస్తీర్ణం ఎంత ఉన్నా ఇచ్చేశారంటూ విమర్శలు గుప్పించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాలను కేసీఆర్.. తన వారికి అప్పనంగా అమ్ముకున్నారు. కంచ గచ్చిబౌలి భూముల గురించి పాలించిన పదేళ్లలో ఎందుకు పోరాడలేదు. హెచ్‌సీయూ భూములు అయినా కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఐఎంజీ సంస్థ బిల్లీరావుతో కమీషన్ మాట్లాడుకుని భూముల గురించి పట్టించుకోకుండా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలను సాధించాం. ఈ ప్రభుత్వం కాపాడుకుంటే 400 ఎకరాల భూమి ఐఎంజీ చేతికి వెళ్లి ఉండేది. బిల్లీరావుతో మాట్లాడుకున్న రూ.వేల కోట్ల కమీషన్ పోయిందనే అక్కసుతోనే ఇప్పుడు వీళ్లు మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వంపై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.

‘‘ప్రభుత్వం ఏదయినా ఒక సంస్థ ద్వారానే రుణాలు సేకరిస్తుంది. కోకాపేటలో వేల ఎకాలను రూ.100 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముకోలేదా? టీజీఐఐసీ ద్వారా తీసుకున్న రూ.10వేల కోట్ల రుణాలతో రైతులకు రుణమఫీ చేసింది ఈ ప్రభుత్వం. భారాస ప్రభుత్వం వేల ఎకరాలు అమ్ముకున్నప్పుడు పర్యావరణం గుర్తుకురాలేదా? పదేళ్లలో లక్ష ఎకరాలను డీఫారెస్ట్‌ చేసి అమ్ముకున్నారు. 400 ఎకరాల భూముల్లో కంపెనీలు నిర్మిస్తే.. రాష్ట్ర ప్రజలకు లక్షల ఉద్యోగాలు వస్తాయి. పదేళ్లలో భారాస చేసిన భూదోపిడీపై బహిరంగ చర్చకు కేటీఆర్‌ సిద్ధమా?’’ అని ఛాలెంజ్ చేశారు.

Tags:    

Similar News