ఐలయ్య ఉపన్యాసాన్ని రద్దుచేసిన మళయాళ మనోరమ..ఎందుకు ?
ఐలయ్య(kanche Ilaiah) ఉపన్యాసం కేరళ(Kerala)లో రద్దువ్వటం ఆశ్చర్యంగా ఉంది.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ గురించి సాహితీ ప్రపంచంలో తెలియని వారుండరు. అలాంటి ఐలయ్య(kanche Ilaiah) ఉపన్యాసం కేరళ(Kerala)లో రద్దువ్వటం ఆశ్చర్యంగా ఉంది. విషయం ఏమిటంటే కేరళలోని ప్రముఖ మీడియా సంస్ధల్లో ఒకటైన మళయాళ మనోరమ(Malayala Manorama) ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్-2024 పేరుతో ఒక కార్యక్రమాన్ని క్యాలికట్(Calicut) లో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపన్యసించేందుకు అనేకమంది ప్రముఖ రచయితలను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే కంచె ఐలయ్యను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. ఐలయ్య నవంబర్ 2వ తేదీన ‘ఛాలెంజింగ్ డామినంట్ నెరేటివ్స్’ అనే అంశంపై మాట్లాడాల్సుంది. అందుకు ప్రొఫెసర్ కూడా క్యాలికట్ కు వెళ్ళి ఉపన్యాసం ఇవ్వటానికి రెడీ అయ్యారు.
అయితే సడెన్ గా నిర్వాహకుల దగ్గర నుండి ఐలయ్యకు షాకింగ్ సమాచారం అందింది. అదేమిటంటే ప్రొఫెసర్ ఉపన్యాసాన్ని నిర్వాహకులు రద్దుచేశారు. ఎందుకంటే మూడు రోజుల క్రితం ఒక తెలుగు పత్రికలో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలపై ఐలయ్య ఒక ఆర్టికల్ రాశారు. ‘రెండు దేశాలుగా బతకటం ఒకటే దారి’ అనే హెడ్డింగుతో రాసిన ఆర్టికల్లో ఐలయ్య భావజాలం కాస్త ఇజ్రాయెల్ (Israel) కు అనుకూలంగా ఉందనే ఆరోపణలు వినిపించాయి. దాంతో ఆ ఆర్టికల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. బహుశా ఈ ఆర్టికల్ కేరళ దాకా వెళ్ళుంటుంది.
ఎందుకంటే కేరళలో ముస్లిం మైనారిటీలు పాలస్తీనా(Palestine) కు మద్దతుగా ఉంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దాంతో ఆర్టికల్ కు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలు ఆందోళన చేశారు. క్యాలికట్ లో జరగబోయే లిటరరీ కార్యక్రమానికి ఐలయ్య వస్తున్నారని తెలుసుకున్న మైనారిటీలు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సెంట్రల్ ఇంటెలిజెన్స్(Central Intelligence) కు తెలియగానే అధికారులు వెంటనే కార్యక్రమ నిర్వాహకులతో మాట్లాడారు.
ఐలయ్య రాసిన ఆర్టికల్, కేరళలో ముస్లింల ఆందోళన తదితరాలను వివరించారు. ఐలయ్య గనుక కార్యక్రమానికి వస్తే ముస్లిం మైనారిటీ(Muslim Monorities)లు పెద్దఎత్తున ఆందోళన చేయటానికి నిర్ణయించుకున్న విషయాన్ని వివరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఐలయ్య ఉపన్యాసాన్ని రద్దు చేయించారు. ఇదే విషయాన్ని నిర్వాహకులు ఐలయ్యకు తెలియజేశారు. ఐలయ్య రాసిన ఆర్టికల్ గురించి తమకు తెలియదని నిర్వాహకులు ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్పారు. ఏదేమైనా ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు తాము సెక్యురిటి సమస్య గురించి ఐలయ్య కు చెప్పగానే ఆయనే తన ఉపన్యాసాన్ని రద్దు చెదుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ఇదే విషయమై ఐలయ్య ‘ది తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ‘ముస్లిం మైనారిటీలు ఆందోళన చేస్తామని హెచ్చరించగానే నిర్వాహకులు తన ఉపన్యాసాన్ని రద్దు చేయటం ఏమిట’ని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న విషయాన్ని నిర్వాహకులు మరచిపోయినట్లున్నార’ని ఐలయ్య కామెంట్ చేశారు. ‘తన ఉపన్యాసాన్ని రద్దు చేయటానికి బదులు తనకు రక్షణ కల్పించి ఉపన్యాసం ఇప్పించేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేసుండాల’ని ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ముస్లిం మైనారిటీల్లో అసహనం ఉండకూడదని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.