సీఎంతో మందకృష్ణ మాదిగ భేటీ.. దానిపైనే అసలు చర్చ..
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్‌ను అభినందించిన మందకృష్ణ;
ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం భేటీ అయ్యారు. జస్టిస్ షమీమ్ అక్తర్ అందించిన ఎస్సీ వర్గీకరణ నివేదికలో మందకృష్ణ చెప్పిన లోపాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. మందకృష్ణ చెప్పిన లోపాలను సీఎం రేవంత్ రెడ్డి నోట్ చేసుకుని, వాటిని పరిస్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై ఈ సమావేశంలో కీలకంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశం అనంతరం మందకృష్ణ మాదిగ కీలక విషయాలు పంచుకున్నారు.
‘‘ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్‌ను అభినందిస్తున్నాం. ఒక కమిట్‌మెంట్‌తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటా. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించా. రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు’’ అని తెలిపారు.
ఇలా చేయడం ద్వారా ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం రేవంత్ వివరించారు. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని ప్రతినిధులు గుర్తు చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.