KTR | ‘సింపుల్ లివింగ్‌కు మన్మోహన్ పర్యాయపదం’
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు.;
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ఎన్ని పదవులు వచ్చినా సింపుల్‌గా జీవనం సాగించడానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం లాంటి వారని అన్నారు కేటీఆర్. మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. ‘‘తెలంగాణ దౌత్యవేత్తలు తీసుకొని మన్మోహన్ సింగ్‌ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల నాయకులం ఢిల్లీకి వెళ్లి కలిశాం. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా బరించారు. ఆయన మన్మోహన్ సింగ్ కాదు మౌన మోహన్ సింగ్ అని అవమానించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి’’ అని ప్రశంసించారు.
‘‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్‌లో కేసీఆర్ పనిచేశారు. మంత్రిత్వశాఖ విషయంలో ఓ సమస్య వచ్చింది. కేసీఆర్‌కు మన్మోహన్ షిప్పింగ్ శాఖ కేటాయిస్తే భాగస్వామ్య పక్షంగా ఉన్న డీఎంకే నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ శాఖ ఇస్తామని తమకు మాటిచ్చారన్నారు. దీంతో కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ శాఖను వదులుకున్నారు. తాను వచ్చింది పదవుల కోసం కాదని, తెలంగాణ కోసమని చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్‌తో మన్మోహన్ మాట్లాడారు. ఏ రాష్ట్రం కోసం వచ్చారో.. అది ఫలించాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తితో మన్మోహన్ నాయకత్వంలోనే ప్రత్యేక రాష్ట్రం జరిగింది. దాన్ని మర్చిపోయాం. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సంస్కరణల బాట నుంచి మన్మోహన్ సింగ్ వెనకడుగు వేయలేదు. ఎన్ని రకాలుగా అవమానాలకు గురిచేసినా ఆయన తొణకలేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.