బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు లీగల్ నోటీసులిచ్చిన సింగపూర్ కంపెని

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై అధికార ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు సింగపూర్ సంస్థ నోటీలిచ్చింది.

Update: 2024-10-13 13:31 GMT

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై అధికార ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణం చేస్తోందని, ప్రజలకు పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్ట్‌కు రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నా ఈ విషయంలో విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఇదే అంశంపై ఆరోపణలు చేసి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చిక్కుల్లో పడ్డారు. మూసీ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ విషయంలో కాంగ్రెస్ కుంభకోణం చేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ మెయిన్‌హర్డ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది.

క్రిశాంక్ తన వ్యాఖ్యాలను 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని, అంతేకాకుండా తమపై లేనిపోని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని మెయిన్‌హర్డ్ కోరింది. అదే విధంగా ప్రాజెక్ట్ కన్సల్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన అన్ని పోస్ట్‌లను తొలగించాలని కూడా సదరు సంస్థ డిమాండ్ చేసింది. అలా చేయని పక్షంలో సివిల్, క్రిమినల్ పరంగా న్యాయపరమైన చర్యలు చేపడతామని, అందుకు సిద్ధమైతేనే తమ డిమాండ్లను పెడచెవిన పెట్టాలని హెచ్చరించింది మెయిన్‌హర్డ్ సంస్థ. ఈ లీగల్ నోటీసులపై స్పందించిన క్రిశాంక్ వెనక్కు తగ్గేదేలేదంటూ రిప్లై ఇచ్చారు.

తగ్గే ప్రసక్తే లేదు: క్రిశాంక్

‘‘మూసీ ప్రాజెక్ట్‌పై పెట్టిన పోస్ట్‌లను తొలగించే ఛాన్సే లేదు. ఈ నోటీసులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో చర్చించాం. ఈ నోటీసులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సమాధానం ఇస్తుందని కేటీఆర్ చెప్పారు’’ అని వివరించారు. అంతేకాకుండా ‘‘రూ.3వేల కోట్ల కుంభకోణం కేసులో మెయిన్‌హర్డ్ సంస్థకు పాకిస్థాన్ రెడ్ వారెంట్ నోటీసులు ఇవ్వడం వాస్తవం కాదా? మెయిన్‌హర్డ్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించిన అంశం నిజం కాదా?’’ అని ప్రశ్నించారు క్రిశాంక్. సీఎం రేవంత్ రెడ్డి, సింగపూర్ సంస్థ లీగల్ నోటీసులు, పోలీసు కేసులకు భయపడనని, వేటినైనా న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.

మళ్ళీ ఆరోపణలు చేసిన క్రిశాంక్

ఈ సందర్బంగా మూసీ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీపై క్రిశాంక్ మరోసారి ఆరోపణలు చేశారు. ‘‘రూ.3వేల కోట్ల కుంభకోణం కేసులో పాకిస్థాన్ ద్వారా రెడ్ వారెంట్ నోటీసులు అందుకున్న సంస్థ మెయిన్‌హర్డ్‌కు మూసీ ప్రాజెక్ట్‌ను రేవంత్ అందించారు. మూసీ సుందరీకరణకు మరే ఇతర సంస్థ లభించలేదా?’’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా లేకుంటే మరే ఇతర సంస్థతో అనుకున్న స్థాయిలో కుంభకోణం చేసేలా డీల్ కుదరలేదా అంటూ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ సహా పలువురు కీలక నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌కు పేదల ఇళ్ల కన్నా మూసీ సుందరీకరణే ముఖ్యమైపోయిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

Tags:    

Similar News