మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డికి ఏడేళ్ళు జైలుశిక్ష
ఒకపుడు ఎంతో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మైనింగ్ కింగ్ గా పాపులరైన గాలి జనార్ధనరెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్ళు జైలుశిక్ష విధించింది;
ఒకపుడు ఎంతో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మైనింగ్ కింగ్ గా పాపులరైన గాలి జనార్ధనరెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్ళు జైలుశిక్ష విధించింది. గాలితో పాటు ఈ కేసులో మరో నలుగురికి కూడా కోర్టు ఏడేళ్ళు శిక్షను ఖరారుచేస్తు మంగళవారం మధ్యాహ్నం తీర్పిచ్చింది. ఇదే కేసులో ఆరోపణలను, విచారణను ఎదుర్కొన్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు యెర్రా శ్రీలక్ష్మి, కృపానదంపైన ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఇంతకీ కేసు ఏమిటంటే 2009లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో గాలి జనార్ధనరెడ్డి(Gali JanardhanReddy) ఇనుపగనులను లీజుకు తీసుకున్నారు. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, మల్పనగుడి గ్రామాల్లోని ఇనుపగనుల తవ్వకాల కోసం ఓఎంసీ కంపెనీ(OMC Company) భూములను ప్రభుత్వం నుండి లీజుకు తీసుకుంది. అయితే తనకిచ్చిన భూముల్లోనే కాకుండా పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి రిజర్వ్ ఫారెస్టు భూముల్లో కూడ తవ్వకాలు చేసిందన్నది కంపెనీపైన ఉన్న ఆరోపణ.
అలాగే ఇనుపగనుల తవ్వకానికి మొదటి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి. ఏదైనా కారణంతో సదరు కంపెనీ పక్కకుపోతే తర్వాత దరఖాస్తు చేసుకున్న కంపెనీకి అనుమతులు మంజూరుచేయాలి. అయితే పైన చెప్పిన ఇనుపగనుల తవ్వకాలకు మొత్తం 24 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా అన్నింటినీ కాదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వం ఓఎంసీ కంపెనీకి గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. ఇలాంటి అనేక ఆరోపణలతో 2009లో అంటే వైఎస్సార్(YSR) మరణించగానే ముఖ్యమంత్రి అయిన కొణిజేటి రోశయ్య ప్రభుత్వం తొమ్మిదిమందిపైన సీబీఐకి ఫిర్యాదులు చేసింది. అక్రమాలు రెండు రాష్ట్రాల్లో జరిగాయన్న ఆరోపణలున్నాయి కాబట్టి ప్రభుత్వం సీబీఐ(CBI)తో దర్యాప్తుచేయించాలని అనుకున్నది. ప్రభుత్వం ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తుచేసింది.
14 ఏళ్ళపాటు అనేక కోణాల్లో కేసును దర్యాప్తుచేసిన సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిదిమందికి వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు సంబంధించి సాక్ష్యాలను సేకరించేందుకు ఆధునిక టెక్నాలజీని సైతం ఉపయోగించింది. మొత్తానికి ఓఎంసీ కంపెనీ తనకు ఇచ్చిన భూములు ఓబుళాపురం గ్రామంలో 68.5 హెక్టార్లు, మల్పనగుడి గ్రామంలో 39.5 హెక్టార్లలోనే కాకుండా బళ్ళారి రిజర్వ్ ఫారెస్టులో కూడా తవ్వకాలు జరిపిందనేందుకు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించింది. ఇందుకోసం శాటిలైట్ ఇమేజెస్ ను ఉపయోగించుకున్నది. 14 సంవత్సరాల దర్యాప్తు తర్వాత అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టింది. 219 మంది సాక్ష్యులను విచారించి, 3400 డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందంకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు దొకరకలేదని కోర్టు నిర్ధారించింది. అలాగే గాలి జనార్ధనరెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి బీవీ శ్రీనివాసులరెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, గాలికి పీఏగా పనిచేసిన మొహిసిన్ ఆలీఖాన్ కు సీబీఐ కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధిస్తు తీర్పుచెప్పింది. పై ఐదుగురి వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రు. 880 కోట్ల ఆదాయానికి గండిపడిందని కోర్టు నిర్ధారించింది.
యావజ్జీవ శిక్ష వేయాల్సింది
నిజానికి గాలి జనార్ధనరెడ్డికి కోర్టు యావజ్జీవ శిక్షను విధించాల్సుంది. అయితే విచారణ సమయంలోనే గాలి కొంతకాలం జైలులో గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు శిక్షను ఏడేళ్ళుగా ఖరారుచేసింది. ఇదే విషయాన్ని జడ్జి చెప్పారు. శిక్షను ఖరారుచేయకముందే గాలి జడ్జితో మాట్లాడుతు తానుచేసిన సమాజసేవను, వయసును దృష్టిలో ఉంచుకుని తక్కువ శిక్షను విధించమని రిక్వెస్టు చేసుకున్నాడు. దానికి జడ్జీ బదులిస్తు యావజ్జీవ శిక్షను విధించాల్సున్నా గతంలోనే అనుభవించిన జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకునే ఏడేళ్ళు శిక్ష విధించినట్లు తీర్పు తర్వాత వ్యాఖ్యానించారు. అలాగే అప్పట్లో గనుల శాఖకు డైరెక్టరుగా పనిచేసిన వీడీ రాజగోపాల్ కు అదనంగా మరో నాలుగేళ్ళు శిక్ష విధించారు. ఎందుకంటే గనుల శాఖ డైరెక్టరుగా ఉంటు ప్రభుత్వ సంపదను కాపాడి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాల్సిన పోస్టులో ఉండి అవినీతికి పాల్పడినందుకు అవినీతి నిరోదక శాఖ(ఏసీబీ) చట్టం కింద అదనంగా 4 ఏళ్ళు శిక్షను విధించినట్లు కోర్టు ప్రకటించింది. విచారణ సమయంలో లింగారెడ్డి అనే నిందితుడు మరణించటంతో ఆయన్ను తప్పించారు. కోర్టు తీర్పు తర్వాత గాలి తరపు లాయర్ మాట్లాడుతు సీబీఐ కోర్టు తీర్పును తాము పై కోర్టులో చాలెంజ్ చేస్తున్నట్లు చెప్పారు. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు తమ క్లైంట్లకు ఉందని లాయర్ చెప్పారు.