Kavitha | ‘పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం’

జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు.

Update: 2024-12-11 10:40 GMT

తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్(Food Poison) కావడం షరా మామూలుగా మారిపోయింది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నా.. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలకు బ్రేకులు మాత్రం పడటం లేదు. ప్రభుత్వం, అధికారులు తీసుకుంటున్న చర్చలేంటో కానీ.. ఫలితాలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాలలలోనో, వసతి గృహాల్లోనే ఫుడ్ పాయిజన్ కావడం.. విద్యార్థులు ఆసుపత్రి పాలవడం పరిపాటిగా మారిపోతోంది. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పలువురు విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ అయినట్లు వైద్యులు వివరించారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఘాటుగా స్పందించారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. పాఠశాల అనేది జ్ఞానాలయంగా ఉండాలి కాని.. విష కుంపటిలా మారకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో సంభవిస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రశ్నించారు. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందే ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

‘‘జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొంది. కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారింది. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించాలి. వాటి పరిస్థితులపై సమీక్ష చేసి ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి’’ అని కవిత డిమాండ్ చేశారు. అయితే ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియిస్ కావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వెంటనే ప్రత్యేక కమిటీలను, టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

పేపర్లకే అంకితమైన సీఎస్ ఉత్తర్వులు

ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరు సిబ్బందితో ప్రతి పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీని నిర్వహించాలని, వంటి చేసే సమయంలో వంటశాలను వారి పరిశాలించాలని, వారి ఆహారం తీసుకున్న తర్వాతనే పిల్లలకు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ ఆదేశాలు పేపర్లకే పరిమితమైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు.

సీఎం ఏమన్నారంటే..

‘‘విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌషికాహారం అందించాలి. వారికి మంచి విద్యా అందించాలన్న ఉద్దేశంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేశాం. అదే విధంగా విద్యార్థులకు ఆహారం కూడా నాణ్యమైనది అందించాలని డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కలెక్టర్ వేటు వేయాలి. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరిచినట్లు రుజువైతే సదరు అధికారులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ తనిఖీలు చేయండి. విద్యార్థులకు పెట్టే ఆహారం తయారు చేస్తున్న పరిసరాలు, సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అదే విధంగా విద్యార్థులకు అందించే తాగు నీరు కూడా కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News