Mohan Babu | ‘నాకు 78 ఏళ్లు.. బెయిల్ ఇవ్వండి’
జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టు ఆశ్రయించారు.;
జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ మోహన్ బాబు.. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘నా వయసు 78 ఏళ్లు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. కావున నాకు బెయిల్ చేయాలని కోరుతున్నాను’’ అని మోహన్ బాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో మోహన్ బాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కీలకంగా మారింది.
హైకోర్టు నిర్ణయం ఇలా
డిసెంబర్ 10న విలేకరిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ అంశంపై పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారని, విలేకరికి, మోహన్‌బాబుకు అసలు పరిచయమే లేదని, అలాంటి సమయంలో హత్యాయత్నం ఎలా చేస్తారని, పోలీసులు పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు సరైనవి కావని వాదించారు. మోహన్ బాబు కుటుంబ సమస్యలను మీడియా సంస్థలు పెద్దవి చేసి చూపించాయని, మంచు మనోజ్‌తో వచ్చిన బౌన్సర్లతో ప్రాణహాని ఉండటంతోనే ఆ సమయంలో మోహన్ బాబు అలా రియాక్ట్ అయ్యారని ఆయన తరపు న్యాయవాది వివరించారు. అనంతరం తన వాదనలను వినిపించడం ప్రారంభించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఈ ఘటనపై తొలుత పహడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారని ఆతర్వాత బాధితుడి వాంగ్మూలం ప్రకారం సెక్షన్లు జోడించడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందేనని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరు వర్గా వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్.. ఈ పిటిషన్‌ను కొట్టివేశారు.
పరారీలో మోహన్ బాబు?
అయితే మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేడంతో ఆయన పరారీలో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాగా వాటిపై స్పందించిన మోహన్‌బాబు తాను పరారీలో లేనని స్పష్టతనిచ్చారు. ‘‘నాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించలేదు. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. అది కూడా నా నివాసంలోనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లిపోలేదు. ఒక వార్తను ప్రచురితం చేసే ముందు అందులోని నిజానిజాలను ఒకసారి సరిచూసుకోవాలని మీడియాను కోరుతున్నాను’’ అని మోహన్ బాబు వివరించారు. అనేక మలుపులు తిరిగిన మోహన్ బాబు బెయిల్ పిటిషన్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరడంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు సానుకూలంగానే తీర్పు ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.