కరీంనగర్ లో కోతుల భీభత్సం

ట్రాన్స్ ఫార్మర్ పేలి 14 ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జిలు కాలి బూడిదయ్యాయి

Update: 2025-09-27 12:02 GMT

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి బస్టాండ్ వెనకాల శుక్రవారం కోతులు సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. కోతుల గుంపులో ఒకటి పొరపాటున ట్రాన్స్ ఫార్మర్ పై పడింది. ఇంకేముంది షార్ట్ సర్క్యూట్ అయి 14 ఇళ్లలో విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ శాఖాధికారులు ఘటనాస్థలికి చేరుకుని మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టారు. ఘటనకు ఒక రోజు ముందు గ్రామానికి చెందిన సూరం బాల్ రెడ్డి కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద

కరీంనగర్ జిల్లాలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. మన్నెంపల్లిగ్రామస్థులు కోతుల బెడదనుంచి తప్పించుకోవడానికి పులి బొమ్మను ఆశ్రయించారు. ప్రతి ఇంటి ముందు పులి బొమ్మ వేలాడుతూ కనిపిస్తుంది. కోతుల నుంచి రక్షణగా పులి బొమ్మలు ప్రతీ గడప మీద కనిపిస్తాయి. కరీంనగర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. కొన్ని గ్రామాల్లో అయితే మనుషుల కన్నా కోతుల సంఖ్యే ఎక్కువ. కోతులను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు పెద్ద ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులు కరవడం వల్ల జిల్లాలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది.

Tags:    

Similar News