రేవంత్ వెరీ లక్కీ ?

ఆరుమాసాల క్రిందట ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు అతిపెద్ద సవాలు రైతు రుణమాఫీయే.

Update: 2024-06-28 10:29 GMT

ఆరుమాసాల క్రిందట ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు అతిపెద్ద సవాలు రైతు రుణమాఫీయే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి సిక్స్ గ్యారెంటీస్ హామీలు కీలకపాత్ర పోషించాయి. ఈ సిక్స్ గ్యారెంటీస్ లో రైతు రుణమాఫీ అన్నది చాలా చాలా ప్రధానం. ఎందుకంటే సుమారు 70 లక్షల మంది రైతులు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన హామీ కాబట్టి. ఎన్సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చింది.

అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ కో ఇచ్చిన హామీ ఏమంటే రు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి జనాలు ఓట్లేసి గెలిపించారు. అప్పటికే కేసీయార్ పాలనపైన వ్యతిరేకతకు రేవంత్ తదితరుల హామీలు తోడవ్వటంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతటి సిక్స్ గ్యారెంటీస్ లో మిగిలిన వాటి సంగతి ఎలాగున్నా రైతు రుణమాఫీ మాత్రం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈ హామీని అమలుచేయాలంటే సుమారు 38 వేల కోట్ల రూపాయలు అవసరం అని ఉన్నతాధికారులు లెక్కలు కట్టారు. ప్రభుత్వమేమో లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. రుణమాఫీ హామీ అమలుకు నిధులు సమకూరే మార్గం కనబడటంలేదు. అందుకనే అందుబాటులో ఉన్న బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలతో ప్రభుత్వం మాట్లాడుతోంది.

ఆర్ధికభారాన్ని తగ్గించుకునే విషయంలో ప్రభుత్వం కూడా రుణమాఫీకి నిబంధనలు విధించింది. కేసీయార్ హయాంలో రైతుబంధు పథకంలో అనర్హులు కూడా ఆర్ధికలబ్ది పొందారనే ఆరోపలున్నాయి. రైతుబంధు పథకాన్ని రేవంత్ ప్రభుత్వం బాగా స్టడీచేసింది. ఈ పథకంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తినిపుణుల్లో చాలామంది అనర్హులు లబ్దిపొందినట్లు గుర్తించారు. అందుకనే రైతు రుణమాఫీకి కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ పథకం అమలులో అనుసరిస్తున్న మార్గదర్శకాలనే అనుసరించాలని డిసైడ్ అయ్యింది. దీని ప్రకారం వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే రుణమాఫీని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం రుణమాఫీ భారం రు. 38 వేల కోట్ల నుండి రు. 31 వేల కోట్లకు తగ్గిపోయింది. ఒకేసారి రు. 7 వేల కోట్ల భారం తగ్గటంతో ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం చర్చలు ఫలప్రదమై ఎన్సీడీసీ ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇదే సంస్ధ గతంలో కేసీయార్ హయాంలో గొర్రెల పంపిణీ పథకానికి మొదటివిడతగా రు. 3955 కోట్ల రుణమిచ్చింది. రెండో విడత రుణం రు. 4563 కోట్లు ఇవ్వటానికి రెడీ అయినా ఎందుకనో చివరినిముషంలో ఆపేసింది. బహుశా రాజకీయ కారణాలు, ఎన్నికలు కారణమయ్యుండచ్చు. మొత్తంమీద రుణమాఫీ హామీని నెరవేర్చే విషయంలో అవస్తలు పడుతున్న రేవంత్ ప్రభుత్వానికి ఎన్సీడీసీ నిర్ణయం పట్టరాని సంతోషాన్ని ఇస్తోంది. రైతు రుణమాఫీని రేవంత్ అమలుచేయలేరని కేసీయార్, కేటీయార్, హరీష్ రావుతో పాటు బీజేపీ నేతలు డిసైడ్ అయిపోయారు. ఆగష్టు 15వ తేదీ తర్వాత ఇదే విషయమై రేవంత్ ను ఎండగట్టడానికి ప్రతిపక్షాలు రెడీ అయిపోతున్నాయి.

ఈ నేపధ్యంలోనే రుణం అందించటానికి ఎన్సీడీసీ ముందుకు రావటం రేవంత్ కు చాలా హ్యాపీ అనే చెప్పాలి. అవసరమైన రు. 31 వేల కోట్లలో ఎన్సీడీసీ ఎంతిస్తుంది లేకపోతే మొత్తం అందిస్తుందా అన్న విషయంలోనే క్లారిటిలేదు. ఏదేమైనా ఎన్సీడీసీ నుండి నిధులు అందితే రేవంత్ ప్రభుత్వానికి పెద్ద రిలీఫనే చెప్పాలి. ఇక మిగిలిన హామీలంటారా వాటిల్లో ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత సిలండర్లు, 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకం అమలువుతోంది. ఇక అవ్వాల్సింది నెలకు మహిళలకు రు. 2500 పెన్షన్ మాత్రమే. రుణమాఫీ పథకం ముందు మహిళలకు పెన్షన్ పథకం చాలా చిన్నదనే చెప్పాలి. అందుకనే రేవంత్ చాలా లక్కీఅనే అనుకోవాలి.

Tags:    

Similar News