యువతకు డిగ్రీ మీద మోజు తగ్గిందా?
జీరో అడ్మిషన్లు! మిగిలిపోయిన 3 లక్షల సీట్లు;
డిగ్రీ చదువుపై యువతకు ఆసక్తి తగ్గింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కొరత, ఇతర కోర్సుల వైపు మొగ్గు చూపడం, డిగ్రీ చదువుతో పోలిస్తే వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యత పెరగడం వంటివి ఆసక్తి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపకుండా తక్షణ ఉపాధికి వీలుండే హోటల్ మేనేజ్‌మెంట్, హస్పిటాలిటీ, ఏ.ఐ.టెక్నాలజీ లాంటి స్వల్పకాలిక కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో డిగ్రీలో అడ్మిషన్లు కాక భారీ ఎత్తున సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.
2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఆందోళనకరంగా వున్నాయి. 4,36,927 సీట్లలో 1,43,037 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కళాశాలలతో సహా 957 డిగ్రీ కళాశాలల్లో 2,93,890 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణాలో 957 డిగ్రీ కాలేజీలుండగా, డిగ్రీ ఫస్టియర్‌లో ఈ ఏడాది కేవలం 32శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 68 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఇంకా 2 లక్షల 95 వేల సీట్లు భర్తీ కాలేదు.
ఉస్మానియా పరిధిలో 1.95 లక్షల సీట్లకు 34శాతం, కాకతీయవర్సిటీ పరిధిలో 1.07లక్షల సీట్లకు 31 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే, మొత్తం 64 డిగ్రీ కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం పొందలేదు. 64 కాలేజీల్లో 20,260 సీట్లుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. వీటిలో 63 ప్రైవేట్ కాలేజీలు కాగా, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉంది. ఒక్కరు కూడా చేరని కాలేజీగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజీ నిలిచింది.
గతంలో జీరో అడ్మిషన్ కాలేజీల సంఖ్య 50 ఉండగా ఈ సారి 64కు చేరింది. సున్నా అడ్మిషన్లు నమోదైన కాలేజీలను మూసివేయాలని కొంతకాలంగా అధికారులు భావిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.
సీట్ల భర్తీలో నిజాం కాలేజీ టాప్
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిజాం కాలేజీ సీట్ల భర్తీలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలేజీలో అందుబాటులో ఉన్న 1,197 సీట్లకు గాను 1,170 సీట్లు (97.74%) భర్తీ అయ్యాయి. కోఠి మహిళా కళాశాల (వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం) 93.19 శాతంతో రెండో స్థానంలో, సిటీ కాలేజీ 88.89 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (82.69%), ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (80.98%), నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం డిగ్రీ కళాశాల (80.29%) కూడా ఉత్తమ పనితీరు కనబరిచాయి. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో 73.01%, నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాలలో 68.56%, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో 66.1%, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 65.75% సీట్లు భర్తీ అయ్యాయి.
మంచి సంస్థలో, మంచి వేతనంతో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, మార్కులు కాదు, మంచి నాలెడ్జ్ వుండాలి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని యువత భావిస్తోంది. అందుకే డిగ్రీ చదవడానికి యువత ఆసక్తి చూపడం లేదు. డిగ్రీ అడ్మిషన్ తో సమయం వృద్ధ అనే భావనలో యువతలో వుంది. అందుకే దాదాపు 3 లక్షల సీట్లు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి. సమయంతో పాటు యూనివర్శిటీలు కూడా మారి, మారుతున్న టెక్నాలజీ పరంగా షార్ట్ టైం కోర్సులను అందించే దిశగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.