షెడ్యూల్ ప్రకారమే నామినేషన్స్.. మహేష్ కుమార్ క్లారిటీ
ఎన్నికల నోటిఫికేషన్ యథాతథంగా విడుదల చేయనుంది ఎన్నికల సంఘం.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఉత్కంఠభరితంగా మారింది. గురువారం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ అంశంపై హైకోర్టు బుధవారమే తీర్పు వెలువరుస్తుందని అంతా భావించారు. కానీ న్యాయస్థానం మాత్రం అనూహ్యంగా విచారణను గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది. అంతేకాకుండా నామినేషన్లు వేయకుండా స్టే విధించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనకు నిరాకరించింది. ఈక్రమంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ మరింత పెరిగింది. నామినేషన్ల సంగతి ఏంటి అని పార్టీల్లో అయోమయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నామినేషన్స్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. నామినేషన్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు.
నోటిఫికేషన్ యథాతథం..
అనుకున్న ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయం 10:30 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ పడినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రిక్రియ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా షెడ్యూల్ ప్రకారం జరగనుంది. నోటిఫికేషన్ విడుదలైన అనతరం నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ ప్రకటన కీలకంగా మారింది.
అద్భుత వాదనలు వినిపించారు: మహేష్ కుమార్
‘‘తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గురువారం ఉదయం జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల కేసు కచ్ఛితంగా గెలుస్తాం. దాదాపు 90 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కుల సర్వే జరిగింది. బీసీల నోటి ముద్దను బీజేపీ లాగేసే ప్రయత్నం చేస్తోంది. బీసీల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది. స్థానిక ఎన్నికల్లో 90శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.