బీఆర్ఎస్ లో పెరిగిపోతున్న టెన్షన్

పీసీ ఘోష్ కమిషన్ కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిగా మారింది. నోటీసులు జారీ అయితే ఏమిచేస్తారో చూడాలి.

Update: 2024-08-18 06:48 GMT
kcr

బీఆర్ఎస్ లో ఇరిగేషన్ ప్రాజెక్టుల విచారణ టెన్షన్ పెరిగిపోతోంది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళలో జరిగిన అవినీతి, అక్రమాలు, నాసిరకం నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గడచిన మూడునెలలుగా విచారణ జరుపుతున్న ఘోష్ ఇప్పటికి ఉన్నతాదికారులు, ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములైన ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్+ఇంజనీరింగ్ నిపుణులు, ప్రాజెక్టులకు సంబందించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్ఏ) నిపుణులను విచారించింది. వారినుండి పై ప్రాజెక్టుల్లో జరిగిన లోపాలపై అఫిడవిట్లు తీసుకున్నది. పరిపాలనా సంబందిత, ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష సంబంధాలున్న అందరి నుండి వివరాలు సేకరించింది.

క్షేత్రస్ధాయిలో పనిచేసిన, చేస్తున్న ఉన్నతాధికారులు, నిపుణల నుండి అఫిడవిట్లు సేకరించిన కమిషన్ ఇపుడు ప్రభుత్వ పెద్దలుగా పనిచేసిన వారిపై దృష్టిపెట్టింది. ప్రాజెక్టుల నిర్మాణం, డిజైన్లు, రీడిజైన్లలో నిర్ణయాలు తీసుకున్న కీలక వ్యక్తులను విచారించేందుకు రెడీ అవుతోంది. ఇక్కడ పరిపాలనలో కీలక వ్యక్తులంటే ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావనే అనుకోవాలి. ఎందుకేంట ప్రాజెక్టులు నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నది, డిజైన్లు రెడీ చేసింది, వాటిని కాదని మళ్ళీ రీ డిజైన్లు చేయించింది. అంచనాలు పెంచింది, నిర్మాణ స్ధలాన్ని ఎంపికచేసింది సమస్తమూ కేసీఆరే. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోను, డిజైన్లు మార్చినపుడు కూడా తాను అనుకున్నట్లే ప్రాజెక్టులు పూర్తిచేస్తానని చాలాసార్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసపుత్రికగా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. తాను డిజైన్లు దగ్గరుండి రెడీ చేయించినట్లు కూడా చెప్పుకున్నారు.

కేసీఆర్ నిర్ణయాలను క్షేత్రస్ధాయిలో అమలుచేసింది జలవనరుల శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు. కాబట్టి కమిషన్ తొందరలో నోటీసులు జారీచేయబోతోందంటే ముఖ్యంగా ఈ ఇద్దరికనే అర్ధం. ఇప్పటికే ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు, నాసిరకం నిర్మాణాలకు తమ బాధ్యత లేదని ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికార్లు కమిషన్ కు అఫిడవిట్లు అందించారు. విదాన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చెప్పినట్లుగానే తాము చేశాముకాని సొంతంగా చేసిందేమీ లేదని అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పేశారు. విదానపరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అందరికీ తెలిసిందే.

పదేళ్ళ అధికారంలో కేసీఆర్ వన్ మ్యాన్ షో చేసిన విషయం అందరు చూసిందే. పదేళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నవే అనే ఆరోపణలున్నాయి. మంత్రివర్గంలో చర్చించటం, నిపుణులతో మాట్లాడటం ఏమీలేవు. ముందుగా నిర్ణయం తీసేసుకుని తర్వాత మాటవరసకు మాత్రమే క్యాబినెట్ సమావేశంలో పెట్టేవారు. మంత్రులు కూడా పెద్దగా చర్చించకుండానే అన్నింటికీ ఓకే చెప్పేసేవారు. కేసీఆర్ పదేళ్ళ పరిపాలన ఇలాగే జరిగిందనే ఆరోపణలకు కొదవలేదు.

ఈ నేపధ్యంలోనే జస్టిస్ ఘోష్ కమిషన్ వారంరోజుల్లో జారీ చేయబోయే నోటీసులకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో తెలీదు. తనకు నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని హరీష్ గతంలోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు కేసీఆర్ నోరిప్పలేదు. తన నిర్ణయాలపై విచారణ జరపటాన్నే కేసీఆర్ అవమానంగా ఫీలవుతున్నారు. విద్యుత్ రంగంలోని ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయంలో కేసీఆర్ ఏ విధంగా వ్యవహరించారో అందరు చూసిందే. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ ఛైర్మన్ గా గుర్తించటానికే కేసీఆర్ ఇష్టపడలేదు. అందుకనే సుప్రింకోర్టులో పిటీషన్ వేసి నరసింహారెడ్డిని కమిషన్ ఛైర్మన్ గా తొలగేట్లు చేశారు. అయితే నరసింహారెడ్డి స్ధానంలో ప్రభుత్వం మదన్ బీ లోకూర్ ను కొత్తగా నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డి విషయంలో ఎందుకిలా కేసీఆర్ వ్యవహరించారంటే విచారణకు హాజరుకమ్మని కమిషన్ నోటీసులు జారీచేయటమే.

మరిపుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిగా మారింది. నోటీసులు జారీ అయితే కేసీఆర్ ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News