హెచ్‌ఎండిఎ లేక్ సర్వే ఎందుకు పూర్తి చేయలేదు, రాజకీయాలున్నాయా?

అధికారులు హైదరాబాద్ చుట్టూర ఉన్న చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను నోటిఫై చేయలేకపోవడం భూకబ్జాలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది.

Update: 2024-09-10 08:18 GMT

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో 3,532 చెరువులుండగా, 2013వ సంవత్సరంలో హెచ్ఎండీఏ అధికారులు సర్వే ప్రారంభించినా, పూర్తి చేయలేదు. చెరువులు,మంచినీటి రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ లెవెల్స్, బఫర్ జోన్లు, నాలాల విస్తీర్ణంపై హెచ్ఎండీఏ సర్వే చేసి తుది నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ హెచ్ఎండీఏ సర్వే పూర్తి చేయక పోవడం, చెరువుల విస్తీర్ణంపై నోటిఫికేషన్ విడుదల చేయక పోవడంతో పలు చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించడంతో కుచించుకు పోయాయి.


తెలంగాణ ఆవిర్భావంతో ఆక్రమణల జోరు
2014వ సంవత్సరం జూన్ 2వతేదీన దేశంలోనే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ వచ్చాక లేక్ సిటీలోని చెరువుల కబ్జాలకు తెర లేచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని చెరువులు కబ్జాలు అయినా, తెలంగాణ వచ్చాక గడచిన 11 ఏళ్లలోనే అధికంగా చెరువుల కబ్జాలు జరిగాయని చెరువుల పరిరక్షణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ చెప్పారు. ఈ చెరువుల కబ్జాలకు హెచ్ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేయకపోవడం ప్రధాన కారణంగా మారిందని, హెచ్ ఎం డిఎ పరిధిలోని చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్స్ నోటిఫై చేయనుందునే చెరువుల దురాక్రమణ జరిగిందని ఆమె ఆరోపించారు.

మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టినా...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాల్లోని చెరువుల్లో పూడికను తొలగించి, వాటిని పరిరక్షించినా, హైదరాబాద్ నగరంలోన చెరువుల పరిరక్షణను మరిచారని ప్రముఖ యాక్టివిస్టు పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 2006వ సంవత్సరంలో వరదలు వచ్చి హైదరాబాద్ నగరం ముంపునకు గురైనపుడు చెరువులను పరిరక్షించాలని నిర్ణయించినా అమలు చేయలేదు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చెరువుల ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బిల్డర్లు ఎక్కువగా ఆంధ్రావాళ్లు కావడంతో వారు హైదరాబాద్ లోని చెరువులను చెరబట్టి వెంచర్లు వేశారు. గత తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం చెరువుల వద్ద వెలసిన వెంచర్లను నిరోధించలేదు’’అని పాపారావు పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసేందుకు సిద్ధం అయినా తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. మాదాపూర్ లో అయ్యప్పసొసైటీ భూముల్లో వెలసిన భవనాలను కూల్చివేద్దామని నిర్ణయించి ఆ తర్వాత తగ్గారని ఆయన చెప్పారు. హైడ్రా బడా బాబులకు నోటీసులు ఇస్తుందని, కానీ పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వారి ఇళ్లను కూల్చివేస్తుందని ఆయన ఆరోపించారు. పేదలకు ప్రత్యామ్నాయంగా ఆశ్రయం చూపించి వారి ఇళ్లను కూల్చాలని ఆయన కోరారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపులో పెద్దలకు ఒక నీతి, పేదలకు ఒక నీతి ఎలా అని పాపారావు ప్రశ్నించారు.

సర్వేలో జాప్యం...కబ్జా దారులకు వరం
హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 3,532 చెరువులు ఉండగా, వీటిలో 3,116 చెరువులను గత 11ఏళ్లలో అధికారులు సర్వే చేశారు.2013వ సంవత్సరంలో హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి చెరువుల సర్వేలు చేయాలని నిర్ధేశించినా, దీనిపై అధికారులు తాత్సారం చేశారు. దీనివల్లనే చెరువుల కబ్జాలు యథేచ్ఛగా జరిగాయి.చెరువు సరిహద్దులను నోటిఫై చేయక పోవడం కబ్జాదారుల పాలిట వరంగా మారింది. వీటిలో 2,560 చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం మీద ఇప్పటివరకు కేవలం 230 చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల వివరాలతో తుది నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే చెరువుల సర్వే, నోటిఫికేషన్ల జారీ విషయంలో అధికారులు చేసిన తాత్సారంతో చెరువులు యథేచ్ఛగా ఆక్రమణల పాలయ్యాయి. వెయ్యి చెరువుల విస్తీర్ణంపై కనీసం ప్రాథమిక సర్వే కూడా చేయలేదు. ఈ మొత్తం చెరువుల సర్వే పూర్తి చేయడానికి మరో ఏడాది సమయం పట్టవచ్చని అధికారులంటున్నారు.హెచ్ఎండీఏ చెరువుల ప్రాథమిక నోటిఫికేషన్ పై ప్రజలు పలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. హెచ్ఎండీఏ విడుదల చేసిన చెరువుల ప్రాథమిక నోటిఫికేషన్ లో చెరువుల విస్తీర్ణం తగ్గించి చూపించారని క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి, చెరువుల సంరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ లుబ్నా సార్వత్ ఆరోపించారు.

సర్వేకు కదిలిన యంత్రాంగం
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ చెరువుల సర్వేను పూర్తి చేయాలని ఏడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, జిల్లాల పరిధిలోని చెరువుల సర్వేను పూర్తి చేసి నివేదికలు పంపించాలని హెచ్ఎండీఏ కలెక్టర్లను కోరింది.హైడ్రా చేపడుతున్న కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇళ్ల కొనుగోలుదారులు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్దేశించాలని కోరుతూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను కోరాయి.కొంతమంది ఇళ్ల కొనుగోలు దారులు ప్రాజెక్టుల డెవలపర్లకు ఎన్వోసీ తీసుకొని ఇవ్వాలని కోరుతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నీటిపారుదల, రెవెన్యూశాఖలు జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను చూసి లేఅవుట్ అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు ఇస్తోంది.



సర్వేలో తగ్గిన చెరువుల విస్తీర్ణం

పలు చెరువుల సర్వే పూర్తి కాలేదు. చెరువుల భూముల సర్వేనంబర్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూశాఖ వద్ద ఉన్న సర్వే నంబర్లతో సరిపోలడం లేదు. ఆగస్టు నెల నుంచి కేవలం 65 చెరువుల సర్వే చేశారు. 269 చెరువుల ప్రాథమిక సర్వే పూర్తిచేసినా, వాటిలో కేవలం 30 చెరువులను మాత్రమే హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో నోటిఫై చేశారు. 2013వ సంవత్సరంలో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రంలో పలు చెరువుల విస్తీర్ణం ఎక్కువగా ఉండగా, 2024 నాడు తీసిన శాటిలైట్ చిత్రాల్లో పలు చెరువుల విస్తీర్ణం తగ్గిందని తేలిందని చెరువుల సంరక్షణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చెరువుల సర్వేలో చెరువుల విస్తీర్ణం తగ్గించి చూపుతున్నారని ఆమె ఆరోపించారు. చెరువులను పరిరక్షించాలని కోరుతూ డాక్టర్ లుబ్నా సార్వత్ సుప్రీంకోర్టులో 2,తెలంగాణ హైకోర్టులో 8, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో 2, తెలంగాణ లోకాయుక్తలో 1, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఒక కేసు పెట్టారు.

కదిలిన హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ విభాగం
చెరువుల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. చెరువుల సర్వేను సత్వరం పూర్తి చేయించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. గతంలో చెరువుల్లో వెలసిన వెంచర్లకు గంపగుత్తగా నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులు వాటిపై పునర్ పరిశీలన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చెరువుల ఆక్రమణల జోరు పెరగడంతో అధికారులు శాటిలైట్ చిత్రాల ఆధారంగా చెరువుల విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. చెరువుల సంరక్షణకు అధికారులంతా సమాయత్తం అయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని హెచ్ఎండీఏ సీనియర్ అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News