‘శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో’

రేవంత్ అరాచకాలు, దారుణాల నుంచి రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే కాపాడగలరన్న కేటీఆర్.;

Update: 2025-07-25 11:15 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు మొదలయ్యాని, దారుణాలు చూడాల్సి వస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు వరకు అరచేతిలో వైకుంఠం చూపి తీరా అందళం ఎక్కిన తర్వాత ప్రజలను, రాష్ట్రాన్ని అంధకారంలో పడేసేలా ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ శతాబ్ధం మొత్తంలో జరిగిన అతిపెద్ద మోసం ఏదైనా ఉంటే అది 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే అని చురకలంటించారు. వాళ్ల మేనిఫెస్టో అంతా కూడా అబద్ధాలే ఉన్నాయని, వాటిలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్, రేవంత్‌ల అరాచక పాలన నుంచి, దారుణాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడగలితే వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్ఎస్ పార్టీ ‘ఆత్మగర్జన’ సభను ఘనంగా నిర్వహించింది. అందులో పాల్గొన్న కేటీఆర్.. సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటించే రామ్, రెమో క్యారెక్టర్స్ తరహాలోనే సీఎం రేవంత్ కూడా కనిపిస్తున్నారంటూ చురకలంటించారు.

మూటలు ఢిల్లీకి.. డబ్బులు రాహుల్‌కి

రేవంత్ సీఎం అయిన తర్వాత తెలంగాణకు జరిగిన మేలు ఏమైనా ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రావాల్సిన నిధులు ఇప్పటి వరకు అందలేదని, కానీ ఢిల్లీకి మాత్రం మూటులు పోతున్నాయని, రాహుల్ గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ‘‘దళిత బంధు పేరిట కేటీఆర్ రూ.10లక్షలే ఇస్తున్నారని, అదే తాము అధికారంలోకి వస్తే రూ.12లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే సమక్షంలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కలిసి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు 26శాతం ఇస్తామన్నారు. దళితులు, గిరిజనులకు ఇళ్లు నిర్మించకుండా రూ.6లక్షలు ఇస్తామంటూ డిక్లరేషన్‌ో పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్ ఏమైందో ఎవరికీ తెలియదు. రూ.ఆరు లచ్చలు కాదు కదా.. ఆరు పైసలు కూడా ఇవ్వలేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

అన్నీ బోగస్ మాటలే..!

‘‘ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే అది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనెఫెస్టోనే. దానిని నమ్మే తెలంగాణ ప్రజలంతా మోసపోయారు. రెండు సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన రేవంత్.. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక విడత రైతు బంధు వేశారు. దానికి మళ్ళీ భారీగా సంబరాలు చేశారు.

కేసీఆర్ రైతులకు రూ.10,000 ఇస్తే తాము రూ.15000 ఇస్తామన్నారు. ముసలి వాళ్లకు ఇస్తున్న రూ.2 వేల పెన్షన్ ను రూ.4000 చేస్తామన్నారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నాడూ.. తాము అధికారంలోకి వస్తే ఇద్దరికి ఇస్తామన్నారు. అత్తకు రూ.4,000, కోడలికి రూ.20,000 ఇస్తామన్నారు. కానీ అధికారంలో వచ్చాక ఈ హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలుచేయడం లేదు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ లెక్కన మొత్తం రూ.50 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంటే దాన్ని చివరకు రూ.12 వేల కోట్లకు కుదించారు. దాన్ని కూడా సగమే చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం, నెలకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదు. వడ్లకు బోనస్ ఇస్తామని అన్ని బోగస్ మాటలు చెప్పారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

ఆదాయం తెచ్చే దమ్ము వాళ్లకే ఉంటుంది

‘‘కాంగ్రెస్ నేతలు నోరువిప్పడం ఆలస్యం.. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతుబంధు, కేసీఆర్ కిట్లు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, గురుకులాల్లో సన్నబియ్యం ఇలా ఏదీ ఆగకుండా అన్నింటిని అందించిన నేత కేసీఆర్. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము ఉన్న వారికే ఆదాయాన్ని సృష్టించే సత్తా ఉంటుంది. హామీ డబ్బుల కోసం రైతులు ఖాతాలు ఊసురోమంటుంటే.. రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం టకీ..టకీ మని డబ్బులు పడుతున్నాయ్. ప్రజాస్వామ్యంలో ఓటే తూటా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే అహంకారంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు బుద్ది వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

మళ్ళీ కేసీఆర్ వస్తేనే..

ఈ ప్రభుత్వ పాలనలో గురుకులాల్లో పిల్లలకు అన్నం స్థానంలో విషం పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఈ ఏడాదిలోనే వందమందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇందుకు రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ‘‘వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి తిన్న భోజనం ఖరీదు ఒక ప్లేటుకు లక్ష 35 వేల రూపాయలు. అందాల పోటీల్లో ఒక్క ప్లేట్ భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వానికి కనీసం వంద రూపాయలతో గురుకులాల పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న సోయి లేదు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ గురుకులాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా పనిచేశాయి. కాంగ్రెస్ పాలనలో తెర్లు అయిన తెలంగాణలో మళ్లీ బాగు చేసుకోవాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే’’ అని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News