పీకే దృష్టికి హైదరాబాద్ లో సమస్య

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఐక్యత అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు.

Update: 2024-08-07 14:02 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఐక్యత అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన క్యాబ్‌ డ్రైవర్లను హైదరాబాద్‌ విడిచి వెళ్లాలని కోరడం సరికాదని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. తెలంగాణకు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్‌ లోని తమ సహచరుల పట్ల సానుభూతితో ఉండాలని కోరారు. వారిని తరలించడం వల్ల 2,000 కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ ను కలిశారు. హైదరాబాద్‌ లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నారని, దీంతో అక్కడ నివసించలేకపోతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని అధికారులు, క్యాబ్‌ డ్రైవర్లు తమను వేధిస్తున్నారని, జూన్‌ 2తో హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిలిచిపోయిందని, అందుకే హైదరాబాద్‌ విడిచి వెళ్లాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.

ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ పదేళ్ల గడువు ముగియడంతో మరోసారి తమ వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాలని కోరుతున్నారని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ల బృందం గత నెలలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ లో తమ వాహనాలపై ఇప్పటికే లైఫ్ ట్యాక్స్ చెల్లించామని, మళ్లీ పన్ను విధించడం వల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని క్యాబ్ డ్రైవర్లు తెలిపారు. మరోవైపు తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో నమోదైన టాక్సీల "అక్రమ" రాకపోకలను నిలిపివేయాలని తెలంగాణకు చెందిన ఒక వర్గం క్యాబ్ డ్రైవర్లు రవాణా శాఖను కోరుతున్నారు. ఈ టాక్సీలు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. 

సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ హామీ...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుంది. నేను పదేపదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలని ఎందుకు చెబుతానంటే... ఇక్కడ అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయి. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుంది. అక్కడి ప్రాంతం, ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య నా దృష్టికి వచ్చింది. వారికి అక్కడి క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి, వారి భృతి విషయంలో సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయి. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు. 2 వేల కుటుంబాల వేదన దీనిలో దాగుంది. మానవత థృక్పధంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం. అక్కడి క్యాబ్ డ్రైవర్ కార్మికులు సైతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన తోటి డ్రైవర్లకు తగు విధంగా స్పందించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags:    

Similar News