కేసీఆర్ విషయంలో రాత్రికి రాత్రి కమిషన్ నిర్ణయం మారిపోయిందా ?
రిపోర్టును కమిషన్(PC Ghosh Commission) ప్రభుత్వానికి ఎప్పుడు అందిస్తుందాని అందరు ఎదురుచూస్తున్న సమయంలో సడెన్ గా కమిషన్ గడువును పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది;
అనుకున్నంతా జరిగింది. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలను విచారిస్తున్న పీసీ ఘోష్ కమిషన్ గడువును రెండునెలలు పొడిగించిందో అప్పుడే అందరికీ అర్ధమైపోయింది. మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, అప్పటి ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ ను విచారణకు పిలిపించేందుకే ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ గడువును పెంచిందని అందరికీ అర్ధమైపోయింది. అందరి అనుమానాలను నిజంచేస్తు కమిషన్ మంగళవారం కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు జారీచేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన హరీష్, 9వ తేదీన ఈటల కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని జారీచేసిన నోటీసుల్లో కమిషన్ స్పష్టంగా ఆదేశించింది.
మామూలుగా అయితే ఈనెల 31వ తేదీన కమిషన్ విచారణ గడువు ముగుస్తోంది. 2024, మార్చిలో పీసీ ఘోష్ విచారణ కమిషన్ ను నియమించిన ప్రభుత్వం జూన్ 30కి రిపోర్టు ఇవ్వాలని చెప్పింది. అయితే ఆ తర్వాత ఆరుసార్లు గడువును పొడిగించింది. అన్నీగడువులు అయిపోయిన తర్వాత ఈనెలాఖరులోగా కమిషన్ తనరిపోర్టును ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్లు సమాచారం. రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించేందుకు ఎక్కువ గడువు కూడా లేదుకాబట్టి కేసీఆర్(KCR), హరీష్(Harish Rao), ఈటలను కమిషన్ విచారించటం లేదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందుకనే కేసీఆర్, హరీష్, ఈటలను విచారించకుండానే కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందించబోతున్నట్లు బాగా ప్రచారం జరిగింది. రెండుమూడురోజుల్లో రిపోర్టును ప్రభుత్వానికి అందించేందుకు కమిషన్ బిజీగా ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో సోమవారం రాత్రి కమిషన్ గడువును మరో రెండునెలలు అంటే జూల్ 31వరకు పెంచుతున్నట్లు ఇరిగేషన్ ప్రిన్సిపుల్ సెక్రటరీ రాహూల్ బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు. దాంతో రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న వారందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
సడెన్ గా ఏమి జరిగింది ?
రిపోర్టును కమిషన్(PC Ghosh Commission) ప్రభుత్వానికి ఎప్పుడు అందిస్తుందాని అందరు ఎదురుచూస్తున్న సమయంలో సడెన్ గా కమిషన్ గడువును పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దాంతో అందరు తెరవెనుక ఏమి జరిగిందనే విషయమే ఆరాలు తీస్తున్నారు. దాంతో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ తెలిసిందే. అదేమిటంటే నాటి పాలకులు కేసీఆర్, హరీష్, ఈటలను విచారించకుండా కమిషన్ సబ్మింట్ చేయబోయే రిపోర్టు అసంపూర్ణంగా ఉంటుందని న్యయనిపుణులు అభిప్రాయపడ్డారని సమాచారం. ఏడాదికి పైగా విచారణలో కమిషన్ సుమారు 110 మందిని విచారించింది. ఇందులో సర్వీసులో ఉన్న ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులతో పాటు రిటైర్ అయిన ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఇంజనీరింగ్ నిపుణులు, కాళేశ్వరం(Kaleswaram Project), మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులను నిర్మించిన సంస్ధల ప్రతినిధులున్నారు.
విచారణకు హాజరైన వారిలో కొందరు మాత్రం తమకు అప్పుడు ఏమిజరిగిందో గుర్తులేదని చెప్పగా చాలామంది అప్పటి పాలకుల నిర్ణయాలనే తాము అమలుచేసినట్లు అఫిడవిట్లు కూడా దాఖలుచేశారు. అప్పటి పాలకులంటే కేసీఆరే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావున్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కాళేశ్వరం ప్రాజెక్టును తానే ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించానని, ప్రాజెక్టు తన బ్రైన్ చైల్డ్ అని కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. ఇదేవిషయాన్ని కమిషన్ ముందు చాలామంది గుర్తుచేశారు. ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫులతో పాటు చాలామంది పాలకులదే తప్పని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఫైళ్ళను తమదగ్గరకు పంపించి అర్జంటుగా సంతకాలు పెట్టాలని తమపైన అప్పటి పాలకులు ఒత్తిళ్ళు పెట్టినట్లు అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పారు. అఫిడవిట్లు దాఖలుచేసిన వాళ్ళల్లో అత్యధికులు చెప్పింది ఏమిటంటే ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్, హరీష్ దే అని.
రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించబోయే కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో చాలామంది ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలకు అప్పటి పాలకులే కారణమని చెప్పిన తర్వాత అప్పటి పాలకులను విచారించకుండా రిపోర్టు సబ్మిట్ చేయకూడదని న్యాయనిపుణులు అభిప్రాయపడినట్లు సమాచారం. రిపోర్టును అచ్చంగా పనిచేస్తున్న, రిటైర్ అయిన ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ నిపుణుల వాగ్మూలాలను మాత్రమే రెడీచేసి రిపోర్టు ఇస్తే న్యాయసమీక్ష ముందు నిలబడదని చెప్పినట్లు తెలిసిందే. కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఎవరిమీదైనా యాక్షన్ కు దిగితే వాళ్ళు కోర్టులో చాలెంజ్ చేసే అవకాశముందని చెప్పారని తెలిసిందే. పాలకులను వదిలిపెట్టి అధికారుల మీద మాత్రమే యాక్షన్ ఎలాగ తీసుకుంటుందని కోర్టులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోవటానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదని న్యాయనిపుణులు చెప్పారు.
విచారణకు హాజరవుతారా ?
అందుకనే రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకుని కమిషన్ గడువును పొడిగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపధ్యంలోనే మంగళవారం ఉదయం కమిషన్ నుండి కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు నోటీసులు కూడా జారీఅయిపోయాయి. నోటీసులకు వీళ్ళ ముగ్గురు ఎలాగ స్పందిస్తారన్నది వాళ్ళిష్టం. ఈముగ్గురినీ విచారించటానికి కమిషన్ ప్రయత్నించింది అని చెప్పుకోవటానికే ముందుజాగ్రత్తగా కమిషన్ నోటీసులు జారీచేసినట్లుంది. విచారణకు హాజరైతే తన దగ్గరున్న సమాచారం ఆధారంగా కమిషన్ విచారిస్తుంది లేకపోతే విచారణకు పిలిచినా హాజరుకాలేదని రాసుకుంటుంది. ఎందుకంటే విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు రావాలని ఇచ్చిన నోటీసులను కేసీఆర్ హైకోర్టులో చాలెంజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తనను విచారించే అర్హత కమిషన్ కు లేదని కేసీఆర్ తన పిటీషన్లో వాదించారు. కాబట్టి తాజా నోటీసుల విషయంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.