సన్నబియ్యం కోసం రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు
తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి;
రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవని, ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కి రేషన్ కార్డు, సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచనే రాలేదన్నారు.
సూర్యపేటజిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 5.61 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భధ్రత, ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం అందించడం ఇదీ పేదల సంక్షేమంపట్ల మా వజ్ర సంకల్పమని ముఖ్యమంత్రి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రేషన్ షాపులు బోసిపోతే, ప్రస్తుతం సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ షాపులకు పేద ప్రజలు క్యూ కడుతున్నారన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగతుర్తికి గోదావరి నీళ్లు తేలేకపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కనీసం దేవాదుల నుంచి కూడా తేలేకపోయారన్నారు. దేశం తలెత్తుకునేలా తెలంగాణలో వరి ఉత్పాదన ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
అంతకుముందు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి పర్యటించారు.