జన్వాడ రేవ్ పార్టీ కేసులో రాజ్ పాకాలను ప్రశ్నిస్తున్న పోలీసులు
జన్వాడ ఫాం హౌస్ రేవ్ పార్టీ కేసులో నిందితుడైన రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీసుల ఎదుట హాజరయ్యారు.మద్యం పార్టీకి సంభందించి పోలీసులు రాజ్ పాకాలను ప్రశ్నిస్తున్నారు.
By : The Federal
Update: 2024-10-30 08:57 GMT
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల రేవ్ పార్టీ కేసు సంచలనం రేపుతోంది. జన్వాడ రేవ్ పార్టీ కేసులో రాజ్ పాకాల మోకిల పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో తాను పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం కావాలని రాజ్ పాకాల తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి కోర్టు నుంచి సమయం తీసుకున్నారు.
- రాజ్ పాకాల బుధవారం తన న్యాయవాదితో కలిసి పోలీసుల విచారణకు పోలీసుస్టేషనుకు వచ్చారు. దీంతో పోలీసులు రాజ్ పాకాలను ప్రశ్నిస్తున్నారు.
- జన్వాడ రిజర్వు కాలనీలో రాజ్ పాకాల ఫాంహౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీతో పాటు డీజే సౌండుతో ఈవెంట్ నిర్వహిస్తుండగా మోకిల పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. పార్టీకి హాజరైన రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరిని పరీక్షించగా అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి రాజ్ పాకాలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
- విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి బెయిలు ఇచ్చి వదిలేశారు. డ్రగ్స్ తీసుకున్న విజయ్ ఫోన్ కావాలని అడిగితే ఆయన ఓ మహిళ ఫోన్ అందజేశారు. దీంతో విజయ్ ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.