పోలీసులకు తలనొప్పిగా మారిన అఘోరీ(ర)

చీటింగ్ కేసులో అఘోరీ(ర)ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని జైలుకు పంపగా.. అతనిని ఏ బారాక్‌లో పెట్టాలి అన్నది జైలు అధికారులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.;

Update: 2025-04-23 11:32 GMT

కొంతకాలంగా తెలంగాణలో తీవ్ర హల్‌చల్ సృష్టించింది ఎవరైనా ఉన్నారా అంటే అది ఈ అఘోరీ(ర) అనే చెప్పాలి. తొలుత పెద్ద సాధువును అన్నట్లు చెప్పుకున్నా ఈ వ్యక్తి కొన్నాళ్లకే ఆలయాల దగ్గరకి వెళ్లి గోల చేయడం చేస్తూ ఎలాగైనా వార్తల్లో ఉండేలా ప్రయత్నించారు. ఇటీవల ఓ యువతి.. ఈ అఘోరీ(ర)ను పెళ్ళి చేసుకోవడంతో ఆ విషయం దేశమంతా సంచలనంగా మారింది. ఇదెక్కడి వింతరా బాబు అన్నట్లు అంతా అవాక్కయ్యారు. అఘోరీ(ర) అంటేనే అన్ని భవబంధాలను వీడినవాడు కావాలి కదా.. అలా మారిన తర్వాత పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టో? అని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ అఘోరీ(ర) అంశాన్ని మొక్కగా ఉన్నప్పుడే యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు.. అనేక కారణాలతో పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఇది వారికే పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల చీటింగ్ కేసులో అఘోరీ(ర)ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని జైలుకు పంపగా.. అతనిని ఏ బారాక్‌లో పెట్టాలి అన్నది జైలు అధికారులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

దీంతో ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్ లో ఉంచలేమని పేర్కొంటూ సంగారెడ్డి జైలు అధికారులు అఘోరీ(ర)ను వెనక్కి పంపారు. లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమంటూ వారు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పోలీసులు అఘోరీ(ర)కు లింగనిర్ధారణ పరీక్షలు చేయించడానికి ఆదేశాలు కోరడానికి న్యాయమూర్తిని ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అఘోరీ(ర) చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మొదట్లోనే యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతటి తలనొప్పులు పోలీసులకు వచ్చి ఉండేవి కాదు కదా? అని కొందరు అంటున్నారు. మరి ఈ విషయం ఇక ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే చీటింగ్ కేసులో అఘోరీ(ర)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజల పేరుతో తన దగ్గర నుంచి రూ.9.5లక్షలు తీసుకుని అఘోరీ మోసం చేసిందంటూ ప్రొడ్యూసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన మోకిలా పోలీసులు.. లేడీ అఘోరీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో భాగంగానే అఘోరి(ర)ను సంగారెడ్డి జైలుకు తరలించారు పోలీసులు. అక్కడ లింగనిర్ధారణ జరగితేనే జైలులో ఉంచగలమని అధికారులు చెప్పడంతో పోలీసులు ఇప్పుడు ఆ విషయం తేల్చడంపై ఫోకస్ పెట్టారు.

Tags:    

Similar News