తెలంగాణాలో బాంబులు పేలబోతున్నాయా ?

బాంబులంటే చంపుకోవటానికి వేసుకునే బాంబులు కావు. పేలబోయేవి పొలిటికల్ బాంబులు.

Update: 2024-10-24 06:49 GMT
Minister Ponguleti Srinivasa Reddy

తొందరలోనే తెలంగాణాలో బాంబులు పేలబోతున్నాయట. బాంబులంటే చంపుకోవటానికి వేసుకునే బాంబులు కావు. పేలబోయేవి(Political Bombs) పొలిటికల్ బాంబులు. అంటే ఒకటి రెండు రోజుల్లోనే ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్(BRS)లో ఎవరో కీలక నేతలపై కేసులు పెట్టి లోపలేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అర్ధమవుతోంది. దీన్నే పొంగులేటి(Ponguleti SrinivasaReddy) పొలిటికల్ బాంబులని చెప్పింది. కొత్తగా కేసులు పెట్టకపోతే ఇప్పటికే నమోదైన కేసుల్లో అరెస్టుచేసే అవకాశాలున్నాయి. ఇపుడీ విషయంపైన జోరుగా చర్చలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే దక్షిణకొరియా(South Korea), సియోల్(Seoul) పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనే. పొంగులేటి సియోల్ లో వెంటతీసుకుపోయిన మీడియా(Media)తో మాట్లాడుతు ఒకటి, రెండు రోజుల్లోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నట్లు చెప్పారు.

ఆ బాంబుల పేలుళ్ళల్లో ప్రధాన నేతలే ఉంటారని కూడా చెప్పారు. ధరణి(Dharani Portal), ఫోన్ ట్యాపింగ్Telephone Tapping), కాళేశ్వరం(Kaleswaram Project)తో పాటు 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి విషయాలన్నింటినీ ప్రజల ముందు ఉంచబోతున్నట్లు చెప్పారు. తప్పుచేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళయినా వదిలేదని సినిమా టైపు హెచ్చరిక చేశారు. ప్రధాన నేతలను లోపలేసేందుకు అవసరమైన ఆధారాలతో ఫైళ్ళు సిద్ధమైనట్లు కూడా పొంగులేటి చెప్పారు. కక్షసాధిపులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ దిగదని అయితే చేసిన తప్పులను కూడా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. గతంలో జరిగిన తప్పులు, అవినీతి విషయంలో తాము కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కావటంలేదన్నారు. జరిగిన అవినీతి మొత్తానికి ఆధారాలను సేకరించి పక్కగానే చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.

మంత్రిచెప్పిన పొలిటికల్ బాంబులు పేలటాన్ని చూద్దాం. అవేమిటంటే ముందుగా ధరణి గురించి మాట్లాడుకుంటే ఇందులో వేలాది ఎకరాలు చేతులు మారిపోయాయనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా రికార్డుల్లో చూపించి తర్వాత ముఖ్యనేతలు చెప్పినట్లుగా రికార్డుల్లో మార్పులు చేసి కొందరికి అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టేసినట్లు చాలా ఆరోపణలే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేది. కాబట్టి ధరణి పోర్టల్ నిర్వహణ, అవకతవకలకు పాల్పడటం, అవినీతికి తెరలేపటం, సూత్రదారులు, పాత్రదారులపైన ప్రభుత్వానికి ఇపుడు ఆధారాలు ఏమన్నా దొరికి ఉండవచ్చు.

రెండో అంశం టెలిఫోన్ ట్యాపింగ్ ను చూద్దాం. ఈ విషయంపైన కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఆరోపణలు చేసింది. అధికారంలోకి రాగానే ప్రత్యేక దర్యాప్తు బృందం(Special Investigation Team)ను నియమించి దర్యాప్తు చేయిస్తోంది. సిట్ అధికారులు ఇప్పటికే అడిషినల్ ఎస్పీ, డీఎస్పీ స్ధాయి అధికారులు చాలామందిని అరెస్టులు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్టయిన పోలీసు అధికారులందరు వాగ్మూలాలు కూడా ఇచ్చారు. అరెస్టయిన అధికారుల వాగ్మూలాల ప్రకారం ట్యాపింగ్ కీలక పాత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్(Intelligence Chief) ప్రభాకర్ రావ(Prabhakar Rao)ని తేలింది. అయితే ప్రభాకరరావు విచారణకు హాజరైతే కాని ట్యాపింగ్ అసలు సూత్రధారులు ఎవరో తెలీదు. ప్రభాకరరావును అమెరికా(America) నుండి హైదరాబాదు(Hyderabad)కు రప్పించేందుకు సిట్ అధికారుల వల్ల కావటంలేదు. కాబట్టి ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం ఎవరిమీదా ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకునే స్ధితిలో లేదు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు తెలిసిందే. దీనిపై విచారణకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్(Retired Justice PC Ghosh) నేతృత్వంలో కమిషన్ వేసింది. కమిషన్(Inquiry Commission) ఇప్పటికే చాలామందిని చాలాసార్లు పిలిచి విచారిస్తోంది. విచారణ జరుగుతోంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించి ఎవరిమీదా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశంలేదు. సో, పై మూడు అంశాలను గమనిస్తే టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికిప్పుడు ఎవరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనబడటంలేదు. మిగిలింది ధరణి పోర్టల్ లో జరిగిన అవినీతి మాత్రమే. ఈ విషయంలో బీఆర్ఎస్ లోని కీలకవ్యక్తుల పాత్రకు ఆధారాలు దొరికితే యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి.

ఇవి మినహా మిగిలినవన్నీ రాజకీయ ఆరోపణలే అని అందరికీ తెలుసు. అందుకనే వాటిపై కేసులు పెట్టి అరెస్టులు చేసేంత స్ధాయిలో నిలిచేవికావు. పైన చెప్పుకున్న అంశాలు కాకుండా ప్రభుత్వానికి కొత్తగా ఇంకేవైనా అస్త్రాలు దొరికాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్(Drugs) దందాలో చాలామంది పేర్లు బయటపడినా అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి తప్ప ఆదారాలు ఏవీ దొరకలేదు. మరి పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబులు ఎప్పుడు, ఏ రూపంలో పేలుతాయి ? తాము సియోల్ నుండి హైదరాబాదుకు తిరిగొచ్చేంత లోపే పేలుతాయని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే పొంగులేటి బాంబుల ప్రకటన ఇపుడు తెలంగాణాలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News