కొత్త ప్రభాకర్‌కి పొంగులేటి వార్నింగ్..

ధరణి పోర్టల్‌తో భూములను దోచుకుని.. వారి అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందేమో అని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని చురకలంటించారు.;

Update: 2025-04-15 08:03 GMT

అధికార దాహంతోనే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు కోరుతున్నాంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి మండిపడ్డారు. తమది ప్రజా మద్దతుతో వచ్చిన ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచే కొందరు అధికారం దాహంతో కూల్చే ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. కేసీఆర్‌ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి పునరుద్ఘాటించారని చెప్పారు. ధరణి పోర్టల్‌తో భూములను దోచుకుని.. వారి అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందేమో అని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని చురకలంటించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫుల్‌గా అవినీతి చేసి లాభపడిన వారే ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారని, నిజాయితీగా ఉన్న వారెవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. తమ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని బీఆర్ఎస్ ప్లాన్స్ చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రంలో పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని తెలిపారు మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని, రాష్ట్ర నలుమూలల వరకు తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పుడు ‘భూభారతి’ సహాయంతో రాష్ట్రాన్ని భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ‘‘గతంలో అక్రమంగా భూములు కొల్లగొట్టారు. వాటిని భూభారతి ద్వారా ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. అందుకే ఆయన భయాందోళనకు గురవుతున్నారు. కేసీఆర్‌ సూచన మేరకే ప్రభాకర్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని భారాస నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. భూభారతితో పేదల ఆస్తులను తిరిగి పేదలకు పంచుతాం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలుస్తామని పగటి కలలు కంటున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ ఆత్మ. ఈ ప్రభుత్వంపై మొదటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి. వెంటనే సీఎం అయిపోవాలని తండ్రి, కుమారుడు చూస్తున్నారు’’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News