సైంటిస్ట్ కుటుంబానికి స్వయంగా వరదసాయం అందించిన మంత్రి

తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలను జలసంద్రంలో ముంచిన వరదలు.. ఓ యువ సైంటిస్టును, ఆమె తండ్రిని ఒకేసారి పొట్టన పెట్టుకున్నాయి.

Update: 2024-09-04 15:03 GMT

భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. వరదల కారణంగా ఏపీలో 20 మంది తెలంగాణలో 17 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలను జలసంద్రంలో ముంచిన వరదలు.. ఓ యువ సైంటిస్టును, ఆమె తండ్రిని ఒకేసారి పొట్టన పెట్టుకున్నాయి. కాగా, వరదల కారణంగా మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అందులో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.

బుధవారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి పొంగులేటి.. మరణించిన అశ్విని ఇంటికి వెళ్ళారు. అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ చిత్రపటాలకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎక్స్ గ్రేషియా చెక్కుతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించారు. అశ్విని మరణంతో దేశం ప్రపంచం ఒక యువ సైంటిస్ట్ ని కోల్పోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరద మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఖమ్మం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. అశ్విని సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే ప్రయత్నం కూడా చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

విషాదం నింపిన తండ్రీకూతుళ్ల మరణం...

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని ఢిల్లీలోని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్‌తో కలిసి ఆదివారం కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద వంతెనపై ఆకేరువాగు ప్రవాహానికి వారి కారు కొట్టుకుపోయింది.

దీంతో అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మెడ వరకు నీళ్ళొచ్చేశాయని తెలిపారు. అనంతరం కుటుంబసభ్యులు వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో... ఆందోళనకి గురయ్యారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ తెలియరాలేదు. అనంతరం వారు కొట్టుకుపోయిన ప్రాంతానికి కొంత దూరంలో పొలాల మధ్య మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రీకూతుళ్ళు ఒకేసారి మరణించడంతో కుటుంబంలోనూ, గంగారం తండాలోనూ తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News