సుప్రింకోర్టు రక్షణతో రెచ్చిపోతున్న ప్రభాకరరావు

ట్యాపింగ్ కేసును దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు విచారణలో మాజీ బాస్ చుక్కలు చూపిస్తున్నట్లు సమాచారం;

Update: 2025-07-24 12:31 GMT
Accused in Telephone Tapping

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారుడు, మాజీ ఇంటెలిజెన్స్ బాస్ టీ ప్రభాకరరావు రెచ్చిపోతున్నారు. ట్యాపింగ్ కేసును దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు విచారణలో మాజీ బాస్ చుక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. మాములుగా పోలీసు దర్యాప్తు అంటే నిందితులు లేదా విచారణను ఎదుర్కొనేవారు భయపడటం సహజం. కాని ఇక్కడ సీన్ రివర్సులో నడుస్తోంది. కారణం ఏమిటంటే ప్రభాకరరావుకు సుప్రింకోర్టు రక్షణ ఉండటమే. ట్యాపింగ్(Telephone Tapping) ఆరోపణలపై నిందితుడిని అరెస్టు చేయద్దు, తీవ్రచర్యలు తీసుకోవద్దని సిట్(SIT) అధికారులకు గతంలో సుప్రింకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రింకోర్టు ఆదేశాలను ప్రభాకరరావు చక్కగా ఉపయోగించుకుంటు దర్యాప్తు అధికారులకే విచారణలో చుక్కులు చూపిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తనిష్టమొచ్చిన సమాధానాలు చెబుతున్నారు. పైగా సుప్రింకోర్టులో వారిపైనే ఉల్టాగా కేసు వేయటం ఆశ్చర్యంగా ఉంది.

విచారణపేరుతో తనను సిట్ అధికారులు వేధిస్తున్నారంటు ప్రభాకరరావు దాఖలుచేసిన కేసును సుప్రింకోర్టు ఏమిచేస్తుందో చూడాలి. ఇదేసమయంలో నిందితుడికి గతంలో ఇచ్చిన రక్షణను రద్దుచేయాలంటు సిట్ అధికారులు కూడా సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. నిందితుడికి ఉన్న ఇంటీరియమ్ రక్షణ వల్లే విచారణలో తమకు ఏమాత్రం సహకరించటంలేదని సిట్ అధికారులు తమ పిటీషన్లో చెప్పారు. ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ఏమిటో తేలాలంటే నిందితుడికి అరెస్టునుండి ఉన్న రక్షణను రద్దుచేయాలని సిట్ అధికారులు తమ పిటీషన్లో సుప్రింకోర్టును రిక్వెస్టుచేసుకున్నారు. దీనిపైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉండగా రాజకీయ ప్రత్యర్ధులను వేధించటమే టార్గెట్ గా అప్పటి పెద్దలు సుమారు 4200 ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. ఇవన్ని అనధికారికంగా జరిగిన ట్యాపింగే. అనధికారిక అధికారాలతో ప్రభాకరరావుతో పాటు ట్యాపింగులో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ట్యాపింగ్ అస్త్రాన్ని చేతిలో పెట్టుకుని భార్యా-భర్తల వ్యక్తిగత మాటలను కూడా విన్నారు. వ్యక్తిగత విషయాలను తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించటమే కాకుండా మానసికంగా కూడా వేధించారని చాలా ఆరోపణలున్నాయి. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే ఆనుమానంతో చాలామంది అప్పట్లోనే పోలీసులకు అనేక ఫిర్యాదులు చేశారు. అప్పటి ఫిర్యాదుల ఆధారంగానే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తుచేయిస్తోంది.

ఇపుడు విషయం ఏమిటంటే దాదాపు 20 రోజులుగా ప్రభాకరరావును సిట్ అధికారులు విచారిస్తున్నా ఏమాత్రం సహకరించటంలేదు. కారణం ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా సుప్రింకోర్టు రక్షణ ఉండటమే. అరెస్టు చేస్తారనే భయం ఉంటేనే ఎవరైనా పోలీసులకు సహకరిస్తారు. అలాంటిది అరెస్టు భయమే లేనపుడు ఇక ఎవరైనా పోలీసులకు ఎందుకు భయపడతారు ? ఒకపుడు ఇదే పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన నిందితుడు ఎందుకు భయపడతాడు. రిటైర్ అయిన తర్వాత ప్రభాకరరావును కేసీఆర్(KCR) మళ్ళీ పోలీసుశాఖలోకే తీసుకుని అపరిమితమైన అధికారాలను కట్టబెట్టారు. కేసీఆర్ అండచూసుకునే నిందితుడు ఓ రేంజిలో రెచ్చిపోయారు.

అందుకనే సిట్ అధికారులంటే ఏమాత్రం భయంలేకుండా విచారణలో సహకరించటంలేదు. పైగా విచారణ పేరుతో తనను సిట్ అధికారులు వేధిస్తున్నారంటు ఎదురు కేసువేయటం ప్రభాకరరావుకే చెల్లింది. ఏడాదిపాటు ఇండియాకు రాకుండా అమెరికా(America)లో కూర్చుని ఒకవిధంగా ఇబ్బందిపెట్టిన నిందితుడు హైదరాబాదుకు వచ్చిన తర్వాత మరోరకంగా అధికారులను సతాయిస్తున్నారు. ట్యాపింగ్ ను అడ్డంపెట్టుకుని వేలాదిమంది బీఆర్ఎస్ ప్రత్యర్ధులను తాను లేదా తన టీమ్ ద్వారా వేధింపులకు గురిచేసిన సంగతిని ప్రభాకరరావు మరచిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. మరి రెండువైపుల వాధనలు విన్నతర్వాత సుప్రింకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News