అప్సర హత్యకేసులో పూజారికి జీవిత ఖైదు

ఎప్పుడైతే ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగిందో ఇద్దరూ అన్నీ హద్దులూ దాటేశారు.;

Update: 2025-03-26 08:43 GMT

రెండేళ్ళక్రితం సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసులో పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. విషయం ఏమిటంటే హైదరాబాదు సరూర్ నగర్ లోని ఒక ఆలయంలో సాయికృష్ణ పూజారిగా చేస్తున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలోనే తమిళనాడు నుండి తల్లి, కుతూర్లు అద్దెకు దిగారు. తల్లి, కూతుళ్ళతో పూజారికి పరిచయం ఏర్పడింది. కూతురు పేరు అప్సరని, భర్తతో పడక విడాకులు తీసుకున్నదని తెలుసుకున్నాడు. ఆతర్వాత అప్సరతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం స్నేహితంగా మారి ఆ తర్వాత సన్నిహితులయ్యారు. ఎప్పుడైతే ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగిందో ఇద్దరూ అన్నీ హద్దులూ దాటేశారు.

దాదాపు నాలుగేళ్ళు సన్నిహితంగా ఉన్న అప్పరను పూజారి ఒక పథకం ప్రకారం హత్యచేశాడు. మృతదేహాన్ని అలాగే వదిలేస్తే తనవిషయం బయటపడుతుందని ఆలోచించిన సాయికృష్ణ బాడీని గోతంలో కుక్కేసి మ్యాన్ హోల్లో పడేశాడు. తర్వాత తనకు ఏమీ తెలీదన్నట్లే నటిస్తు పోలీసులకు అప్సర కనబడటంలేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే పూజారిపై అనుమానాలు వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపేటప్పటికి అసలు విషయాన్ని పూజారి చెప్పేశాడు. ఇంతకీ పూజారి చెప్పిన విషయం ఏమిటంటే ఇద్దరిమధ్యా శారీరకసంబంధం ఉండేది. అప్పటికే వివాహం అయిన పూజారి మాయమాటలతో అప్సరను లొంగదీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ళు గడిపాడు. ఒకసారి అమ్మాయికి అబార్షన్ కూడా చేయించాడు.

అబార్షన్ అయిన దగ్గరనుండి తనను వివాహంచేసుకోవాలని అప్సర పూజారిపై రోజూ ఒత్తిడి మొదలుపెట్టింది. అప్పటికే వివాహమైన పూజారికి అప్సరను వివాహంచేసుకునే ఉద్దేశ్యమేలేదు. అవసరం గడుపుకోవటంకోసం ఆ అమ్మాయికి అబద్ధంచెప్పి లొంగదీసుకున్నాడు. వివాహం చేసుకోనని చెబితే అప్పర ఎక్కడ గొడవచేస్తుందో అన్న భయం, విషయం ఇంట్లో తెలిస్తే భార్య ఎలా రియాక్టవుతుందో అన్న అనుమానంతో పూజారి పెద్ద ప్లాన్ వేశాడు. వివాహంచేసుకోమని గోలచేస్తున్న అప్సరను వదిలించుకోవాలని అనుకున్నాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే 2023, జూన్ 3వ తేదీన ఇద్దరం కోయంబత్తూరుకు విమానంలో వెళుతున్నట్లు అప్సరను నమ్మించాడు. విమానాశ్రయానికి వెళదామని కారు తీసుకొస్తే ఆ అమ్మాయి లగేజీతో సహా వచ్చి కారులో కూర్చుంది.

వ్యక్తిగత పనిమీద కోయంబత్తూరుకు వెళుతున్నట్లు తనింట్లో చెప్పాడు. రాత్రి సరూర్ నగర్లో అప్సరతో కలిసి బయలుదేరిన పూజరి రాత్రి 10 గంటల ప్రాంతంలో శంషాబాద్ మండలం రాళ్ళగూడలోని ఒక హోటల్లో భోజనానికి ఆపాడు. భోజనం తర్వాత 11 ప్రాంతంలో సుల్తాన్ పల్లిలోని గోశాలలో కాసేపు గడిపారు. తిరిగివచ్చేటపుడు గోశాల నుండి పెద్ద రాయిని వెంటతెచ్చుకున్నాడు. 4వ తేదీ తెల్లవారిజామున గోశాల సమీపంలోని ఒక ఖాళీస్ధలంకు కారులో చేరుకున్నారు. చల్లటిగాలి వీస్తుండటంతో మాటల్లోనే అప్సర నిద్రలోకి జారుకుంది. అదే అదునుగా సీటుకవరును ఆమె మొహంమీద పెట్టి గట్టిగా అదిమిన పూజారి ఊపిరి ఆడకుండా చేశాడు. కొద్దిసేపటి తర్వాత అప్సరలో చలనం లేదని గ్రహించి అంతకుముందురోజు రాత్రే తనతో తెచ్చుకున్న పెద్ద రాయితో తలపైన పదిసార్లు గట్టిగా మోదటంతో అప్సర అక్కడే చనిపోయింది.

చనిపోయిన అప్సరను కారు కవర్తో కప్పేసి వెనక డిక్కీలో సర్దాడు. తర్వాత అక్కడినుండి తెల్లారిన తర్వాత సరూర్ నగర్లోని ఇంటికి చేరుకున్నాడు. తనింట్లో కారును పార్కుచేసిన పూజారి రెండు రోజులు యాధావిధిగా ఆలయంలో డ్యూటీచేశాడు. తర్వాత మూడోరోజు రాత్రి అప్సర డెడ్ బాడీని తీసుకుని తనింటికి దగ్గరలోనే ఉన్న బంగారు మైసమ్మ ఆలయం సమీపంలోనే ఉన్న మ్యాన్ హోల్లో పడేశాడు. మ్యాన్ హోల్లో నీటి ప్రవాహం ఆగిపోయి దుర్వాసన వస్తోందని చెప్పి పూజరే ఎల్బీ నగర్ నుండి కూలీలను పలిపించాడు. మ్యాన్ హోల్లో రెండు ట్రక్కుల మట్టిని పోయించి మ్యాన్ హోల్ ను పూడ్చి దాన్ని సిమెంటుతో కప్పించేశాడు. ఎప్పుడైతే మట్టి తెప్పించి సిమెంటుతో మ్యాన్ హోల్ కప్పించేశాడు నీటి ప్రవాహం ఆగిపోయింది. దాంతో నీళ్ళు ఎక్కడివి అక్కడే ఉండిపోవటంతో రెండురోజుల తర్వాత వాసన రావటం మొదలైంది. దాంతో స్ధానికులు ఇదేవిషయాన్ని మున్సిపాలిటికి ఫిర్యాదుచేశారు. మున్సిపాలిటి సిబ్బంది వచ్చి పూడికను తవ్వి తీసినపుడు లోపల డెడ్ బాడీ బయటపడింది. వెంటనే విషయం పోలీసులకు చేరటంతో దర్యాప్తు మొదలైంది.

అప్సరను గుర్తుపట్టిన స్ధానికులు విషయం చెప్పటంతో పోలీసుల దర్యాప్తులో జోరుపెరిగింది. చనిపోయిన అమ్మాయి తల్లిని విచారించినపుడు పూజారి విషయం బయటపడింది. దాంతో పూజారిని విచారించిన పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. దాంతో తమదైన శైలిలో విచారణను లోతుగా చేయటంతో అన్నీ విషయాలను పూజారి కక్కేశాడు. తర్వాత అన్నీ సాక్ష్యాలతో పోలీసులు కేసును కోర్టులో ప్రవేశపెట్టారు. రెండేళ్ళు కేసును విచారించిన రంగారెడ్డి కోర్టు అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా పూజారి సాయికృష్ణకు యావజ్జీవ శిక్ష విధించింది. హత్యచేయటమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేసినందకు అదనంగా మరో ఏడేళ్ళు జైలుశిక్ష విధించింది.

Tags:    

Similar News