విద్యార్థులపై కేసులు ఎత్తేయండి.. భట్టి ఆదేశాలు

మరో వివాదం తలెత్తకుండా ఉండటానికే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టిందా?;

Update: 2025-04-07 12:51 GMT

కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్రస్థాయి ఆందోళనలు చేపట్టారు. కాగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరికొందరిని జ్యూడిషియల్ రిమాండ్‌లోకి తీసుకున్నారు. విద్యార్థులపై కేసులు నమోదు చేయడాన్ని విద్యార్థి సంఘాలు, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. తమ రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తును బలిచేయడం సరికాదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తామని కూడా విద్యార్థి సంఘాలు, విపక్షాలు వ్యాఖ్యానించాయి. కాగా తాజాగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు.

400 ఎకరాల భూముల వివాదంలో భాగంగా హెచ్‌సీయూ విద్యార్థులపై పెట్టిన ప్రతి కేసును ఉపసంహరించుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి చర్చించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదంగా అవతరించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ భూముల్లో బుల్డోజర్లతో చదును చేసే పనులను కూడా ప్రారంభించింది. వాటిని అడ్డుకునేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిని అదులోకి తీసుకున్నారు. మరికొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న విధ్వంసాన్ని డ్రోన్ల సహాయంతో చిత్రీకరించిన విద్యార్థులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసిన కారణంగా విద్యార్థులు బంగారు భవితను దెబ్బతీసేలా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది మరో తీవ్ర వివాదంగా మారే అవకాశం ఉండటం వల్లే ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి.. కేసులు ఎత్తివేసేలా నిర్ణయం తీసుకుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ అంశంపై దృష్టిపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ కూడా ఇదే విషయాన్ని సూచించారని, విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదని, వాటిని ఉపసంహరించేలా నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారని సమాచారం. దీంతో ఆలోచనలో పడిన నేతలు సమావేశంపై ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

Tags:    

Similar News