ఈసారి ఎంపీ పోటీకి కవిత ఎందుకు దూరంగా ఉంటారు?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటారా అని కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ.

Update: 2024-03-11 16:38 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటారా అని కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా, పార్టీ మహిళా నేతగా ధర్నాలు, మీటింగుల్లో పాల్గొంటున్నారు తప్ప తాను లోక్ సభ పోటీలో ఉన్నానంటూ సంకేతాలిచ్చే కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం ఆమె కనిపించలేదు. దీంతో కవిత ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉంటారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. అంతేకాదు, ఈరోజు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతో కేసీఆర్ కూతుర్ని నిజామాబాద్ లో పోటీ చేయించడం లేదని, దమ్ముంటే పోటీ చేయించాలని సవాల్ విసిరారు.  "అభ్యర్థుల ఎంపిక మా బాస్ పైనే ఆధారపడి ఉంది. లిస్ట్ లో నా పేరు ఉంటే పోటీ చేస్తా.. లేదంటే పార్టీకి కట్టుబడి ఉంటా" అని ఆమె మీడియా కు చెప్పారు.

ఆమె నిలబడకపోతే, పార్లమెంటులో కెసిఆర్ కుటుంబ సభ్యులు మాయమవుతారు. ఎందుకంటే, కేసిఆర్ మేనల్లుడు సంతష్ కుమార్  రాజ్యపభ నుంచి రిైటరయ్యారు. ఆయనను రీనామినేట్ చేయాలేదు. దానికి బదులు వద్దిరాజు రవిచంద్రను నామినేట్ చేశారు. ఇపుడు కవిత కూడా నిలబడకపోతే, వచ్చే లోక్ సభ లో కల్వకుంట్ల కుటుంబ ప్రాతినిధ్యమే ఉండదు. 

ఇది ఒక వ్యూహం ప్రకారమే జరగుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకుంటే, కుటుంబ సభ్యుల పదవుల సంఖ్యను తగ్గించేందుకే కెసిఆర్ ఈ పనిచేస్తున్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబానికే ఎక్కువ ఉద్యోగాలు దొరికాయని, నిరుద్యోగులకు నిరాశే మిలిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ ఆపకీర్తి నుంచి కుటుంబాన్ని బయటేసేందుకు కెసిఆర్ ఈ వ్యూహం అనుసరిస్తున్నారని పరిశీలకులు  భావిస్తున్నారు.

  ఆమె ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడానికి మూడు ముఖ్య కారణాలున్నాయనే చర్చ జోరందుకుంది. అవేమిటంటే..

ఓటమి ముందే పసిగట్టారా?

కవిత పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలంటే ఆమె సొంత నియోజకవర్గంగా చెప్పుకునే నిజామాబాద్ నుండే బరిలో దిగుతారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమె ఉమ్మడి నిజామాబాద్ లోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గానూ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 2018 ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవగా, యల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచింది. అనంతరం ఆ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరారు. కానీ ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అవడం ఘోర పరాభవం అని చెప్పొచ్చు.

2018 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 3 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కామారెడ్డిలో సీఎం అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు సైతం బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం విశేషం. నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించడంతో స్థానిక ఓటర్లలో బీజేపీపై విశ్వాసం పెరిగిందనే చెప్పాలి. అక్కడి బీజేపీ లీడర్లు కూడా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశారనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి పాజిటివ్ అవ్వొచ్చు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు చీల్చడం తప్ప గెలిచే అవకాశం లేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో పోటీ చేసి ఓడిపోవడం కంటే దూరంగా ఉండటమే బెటర్ అని భావిస్తుండొచ్చు.

బీఆర్ఎస్ - బీజేపీ లోపాయికారిక ఒప్పందంలో భాగంగా..

బీఆర్ఎస్ - బీజేపీ మధ్య లోపాయికారిక ఒప్పందం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేయకపోవడానికి కూడా కారణం అదేనంటూ బలంగా వాదిస్తున్నాయి. ఇక అందులో భాగంగానే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కి మేలు చేకూర్చడానికి కవితని పోటీలో ఉంచడం లేదని అంటున్నారు. ఓ డమ్మీ క్యాండిడేట్ ని నిలబెట్టి, బీజేపీకి రహస్య మద్దతు ఇస్తారనే టాక్ నడుస్తోంది. తద్వారా కవితకి లిక్కర్ స్కామ్ గండం తప్పుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కవిత కూడా లిక్కర్ స్కామ్ గురించి మహిళా దినోత్సవం రోజు మీడియాతో మాట్లాడుతూ "నేను ఆ కేసుని పెద్దగా పట్టించుకోవడం లేదు, మా అడ్వొకేట్ల బృందమే చూసుకుంటోంది" అనడం కొసమెరుపు.

విమర్శలకు చెక్ పెట్టేందుకే..?

"కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణల నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలొచ్చాయి"... ఇది రాష్ట్ర విభజన జరిగి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు, ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ వారిని వెంటాడుతోన్న ప్రధాన విమర్శ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యోగాల భర్తీ పై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే, మీ ప్రభుత్వంలో నలుగురికి ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుల్ని దగా చేసినట్టు మా ప్రభుత్వం చేయదంటూ హస్తం నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు.

మహిళల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న జిఓ 3ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కవిత ఇతర భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఎంతమంది మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం 12 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాలు సాధించారని కవిత ఆరోపిస్తూ, మహిళా రిజర్వేషన్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి ఆసక్తి లేదని ఆరోపించారు.

కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీతక్క.. కాంగ్రెస్ సర్కారుపై కవిత అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. BRS మరోసారి అధికారంలోకి వస్తే కవిత సీఎం కావాలని భావించారు. కాంగ్రెస్ గెలవడంతో ఆమె కల నెరవేరలేదు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 3 ని రద్దు చేయాలని కవిత డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో కవిత ఎంపీగా ఓడిపోయిన అనంతరం మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్న కవిత.. మహిళలకు అన్యాయం జరుగుతుందని దొంగ దీక్షలు చేస్తోంది" అని విమర్శించారు.

కేవలం కవిత ఒక్కరే కాదు, కేటీఆర్ కూడా ఒకే కుటుంబంలో నాలుగు ఉద్యోగాలతో పాటు మేనేజ్మెంట్ కోటాలో పదవులు తెచుకున్నారనే విమర్శలను మోయాల్సి వస్తోంది. నిరుద్యోగులు కూడా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రచారం చేయడానికి ఇది ముఖ్యమైన కారణం.

మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు స్వరాష్ట్రంలో ఓటమి చవిచూడటంతో కారు పార్టీ డీలా పడింది. జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. ఒకవేళ తెలంగాణలో గెలిస్తే కవిత ఎంపీగా పోటీ చేసేవారు కావొచ్చు. ఎందుకంటే కొడుకుకి రాష్ట్ర బాధ్యతలు, కూతుర్ని తనవెంట జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్తారని అంతా భావించారు. అప్పుడు కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో బిజీగా ఉండేవారు.. కవిత కూడా రాష్ట్ర రాజకీయాల్లో కనిపించేవారు. దీంతో నాలుగు ఉద్యోగాల తాలూకా మారక ఎక్కువగా కనిపించేది కాదు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని ఏం చేయమంటారు? కనీసం ఆఫీసుకి అద్దె కూడా కట్టట్లేదు.. మిమ్మల్ని నమ్ముకుని మునిగిపోయామంటూ లేఖలు రాసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే డ్యామేజ్ కవర్ చేసుకునేందుకు కవిత పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.

Similar News