నాపై కుట్ర జరుగుతోందంటోన్న రేవంత్.. ఎవరు చేస్తున్నారు?
నేను ఎక్కడున్నా కొడంగల్ నా గుండె చప్పుడు. దెబ్బతీయడానికి వెనక గూడుపుఠాని
నేను ఎక్కడున్నా కొడంగల్ నా గుండె చప్పుడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడించి నన్ను కింద పడేయాలని బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కొడంగల్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ నేతలు ఏడు మండలాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో కొడంగల్ కు మెడికల్ ఇంజనీరింగ్ వెటర్నరీ నర్సింగ్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చానని తెలిపారు. అయినప్పటికీ తనపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, రేవంత్ రెడ్డిని కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ ఏమన్నారంటే...
వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చా.
రూ. 4వేల కోట్లతో నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చాం.
అయినప్పటికీ రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి?
కరువు ప్రాంతానికి నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తి పోతల తెచ్చినందుకా?
కాలేజీలు తెచ్చినందుకా?
సిమెంటు ఫ్యాక్టరీ తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా?
బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న డీకే అరుణ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేదు.
కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయొద్దని అరుణ కుట్ర చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి వెనక గూడుపుఠాని చేస్తున్నారు.
మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు.
ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు. కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం.
నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. కొడంగల్ ను దేశంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.
నాతో కొట్లాడే హక్కు మీకుంది.. పట్టు పట్టి పని చేయించుకునే అధికారం మీకుంది.
రాష్ట్రానికే నాయకత్వం వహించే అవకాశం సోనియా గాంధీ నాకు ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50 వేల మెజారిటీ అందించాలి. కొడంగల్ పై జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు.