తగ్గేదేలే...అంటున్న రేవంత్

ఏం చేస్తావో చేసుకో... బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను లాగేసుకోవటమే తన టార్గెట్ అని రేవంత్ తెగేసి చెబుతున్నారు.

Update: 2024-07-07 07:50 GMT
Revanth Reddy

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎన్నిరకాలుగా భయపెట్టాలని చూసినా, ఛాలెంజులు చేస్తున్నా, హైకోర్టులో కేసులు వేసినా సరే తగ్గేదేలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. బస్తీమే సవాలంటు కేసీయార్ పైన రేవంత్ తొడకొడుతున్నారు. ఏం చేస్తావో చేసుకో... బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను లాగేసుకోవటమే తన టార్గెట్ అని రేవంత్ తెగేసి చెబుతున్నారు.

పార్టీ ఫిరాయింపులపైన కోర్టులు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవటంలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో నుండి అధికారపార్టీలోకి ప్రజా ప్రతినిధులు ఫిరాయించటం కామన్ అయిపోయింది. ఏపీ, మధ్య ప్రదేశ్, కర్నాటక, తెలంగాణా అన్నీ రాష్ట్రాల్లోను ఫిరాయింపులు రెగ్యులర్ గా జరుగుతునే ఉన్నాయి. అధికారపార్టీలోకి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఫిరాయించకపోతే వాళ్ళ ఆర్ధికమూలాలమీద దెబ్బపడటం ఖాయమైపోయింది. ఆర్ధికమూలాలు దెబ్బతినటమే కాదు వ్యక్తిగతంగా కేసుల్లో ఇరుక్కోవటం తప్పటంలేదు. ఈ నేపధ్యంలోనే కారణాలు ఏవైనా సరే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించేస్తున్నారు. ఒకవైపు ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన కేసు హైకోర్టు విచారణలో ఉన్నాసరే రేవంత్ భయపడకుండా యధేచ్చగా ఫిరాయింపులకు లాకులెత్తేస్తున్నారు. తాజాగా గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.

కోర్టులో విచారణ జరుగుతున్నా సరే రేవంత్ ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటేనే అర్ధమవుతోంది తన ధైర్యం. ఇందుకు రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది. మొదటిది ఫిరాయింపుల విషయంలో కోర్టు జోక్యంచేసుకోదు. రెండోది కోర్టు ఒకవేళ జోక్యం చేసుకున్నా, ఫిరాయింపులు తప్పని చెప్పినా స్పీకర్ ఆ ఆదేశాలను, తీర్పులను లెక్కచేయాల్సిన అవసరంలేదు. అసెంబ్లీ పరిధిలోని అంశాలపై స్పీకర్ దే అంతిమనిర్ణయమని గతంలో చాలాసార్లు స్పష్టమైంది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు, తెలంగాణా హైకోర్టు చెప్పినా అప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబునాయుడు, కేసీయార్ ఏమాత్రం లెక్కచేయలేదు. కాబట్టి ఇపుడు రేవంత్ కూడా ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీర్పుచెప్పినా పట్టించుకుంటారనే గ్యారెంటీలేదు.

శాసన వ్యవహారాల్లోకి న్యాయస్ధానం జోక్యం చేసుకోదని, చేసుకున్నా పట్టించుకోవాల్సిన అవసరంలేదని తెలుసుకున్నాకే రేవంత్ యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. 2014-23 మధ్య కేసీయార్ అచ్చంగా చేసిందిదే. అవసరంలేకపోయినా ఫిరాయింపులను కేసీయార్ విపరీతంగా ప్రోత్సహించారు. తెలంగాణాలో తనకు ఎదురే ఉండకూడదని, అసెంబ్లీలో తనను ప్రశ్నించే గొంతుకే వినబడకూడదన్న ఏకైక లక్ష్యంతో ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఫిరాయింపులకు పాల్పడటమే కాకుండా టీడీఎల్పీ, సీఎల్పీలను బీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. కాబట్టి ఇపుడు జరుగుతున్న ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కును కేసీయార్ కోల్పోయారనే చెప్పాలి. అందుకనే ఫిరాయింపులపై కేసీయార్, కేటీయార్ ఎన్ని ఛాలెంజులు చేస్తున్నా, కవ్విస్తున్నా రేవంత్ ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. తెలంగాణా సమాజం కూడా కేసీయార్, కేటీయార్ను పట్టించుకోని కారణమిదే.

అప్పట్లో ఫిరాయింపులను కేసీయార్ రాజకీయశక్తుల పునరేకీకరణ అని సమర్ధించుకున్నారు. ఇపుడు రేవంత్ కూడా అదే మాటచెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కోసమే తమ పాలన నచ్చి ప్రతిపక్ష పార్టీల ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు వచ్చి తమ పార్టీలో చేరుతున్నట్లు కేసీయార్, కేటీయార్ ప్రకటించుకున్నారు. ఇపుడు కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్న ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో రేవంత్ అవే మాటలను చెప్పిస్తున్నారు. కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్న వాళ్ళంతా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి మారుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చాలనే కేసీయార్ ప్రయత్నానికి తాము మద్దతిస్తున్నట్లు అప్పట్లో ఫిరాయింపులు చెప్పారు. ఇపుడు కూడా అదే బంగారు తెలంగాణా కోసమే తాము రేవంత్ కు మద్దతుగా నిలబడతామని ఫిరాయింపులు అంటున్నారు.

ఇక్కడ కేసీయార్ మరచిపోయిందేమిటంటే కాలం సైకిల్ చక్రం లాంటిదని. చక్రంలోని పుల్లలు ఎప్పుడూ పైన ఉండవు, ఎప్పుడూ కిందనే ఉండిపోవు. పైన ఉండే పుల్లలు కిందకు, కింద ఉన్న పుల్లలు పైకి వెళుతుంటాయన్న విషయాన్ని కేసీయార్ మరచిపోయారు. అందుకనే తెలంగాణాకు తాను శాశ్వత సీఎంని అని అనుకుని బుర్రకుతోచింది చేసుకుపోయారు. కాలం తిరగబడటంతో ఇపుడు ఫాంహౌస్ లో కూర్చుని ఫిరాయింపులపై నానా గోలచేస్తున్నారు. ఇప్పటికి ఆరుగురు ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను రేవంత్ కాంగ్రెస్ లోకి లాగేసుకున్నారు. ఈనెలాఖరులో అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలు మొదలయ్యేలోగా ఇంకెంతమంది కారుపార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరిపోతారో చూడాలి.

Tags:    

Similar News