కేసీఆర్.. తాగుబోతుల సంఘం అధ్యక్షుడు: రేవంత్

వరంగల్ వేదికగా జరుగుతున్న ప్రజా విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై విసుర్లు విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్నారు.

Update: 2024-11-19 12:39 GMT

వరంగల్ వేదికగా జరుగుతున్న ప్రజా విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఛాలెంజ్ చేశారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని మాట్లాడటం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, మహిళలకు కోటీశ్వరులను చేయడమే ఇందిరమ్మరాజ్యం ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మహిళలను అభివృద్ధి చేయాలన్న ఇందిరమ్మ కలను నెరవేర్చడమే సంకల్పంగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, స్వేచ్ఛను ఫీల్ అవుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఏకాడికి తమ కుటుంబ అభివృద్ధి గురించే ఆలోచించింది తప్ప.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ వేదికగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

అదే మా ఉక్కు సంకల్పం

‘‘ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నాం. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యాను. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదు. ఇద్దరు ఆడబిడ్డలకు మేము మంత్రి వర్గంలో చోటు కల్పించాం. అదానీ, అంబానీలను తలదన్నేలా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తాం. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా పూర్తి చేయని దద్దమ్మలు ఈ రోజు మాట్లాడుతున్నారు. తెలంగాణను ప్రపంచం గుర్తిస్తే గత పాలకులు గుర్తించలేదు. కాకతీయుల గొలుసుకట్టు చెరువులు ప్రపంచానికి ఆదర్శం. ఓరుగల్లు సంస్కృతి ఎంతో గొప్పది. చారిత్రాత్మక నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నం. వరంగల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోను.అధికారులను నిద్ర పోనివ్వను’’ అని వెల్లడించారు.

దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్..

‘‘కేసీఆర్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు. రాష్ట్రాన్ని తాగుబోతులుగా మార్చి అధికారంలో కూర్చోవాలని అనుకున్నాడు. తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారు అని మాట్లాడుతున్నారు. మా ప్రజలు ఏమి కోల్పోలేదు. మీరు ఫామ్ హౌస్ లో కూర్చోండి, రోజుకో సీసా పంపిస్తా. మీ నౌకరీ పోతే, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము. భద్రకాళి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, చేసిన. మాట ఇస్తే తల తెగిపడ్డా వెనక్కి పోను. అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. పదేళ్లలో ఎవరికి రుణమాఫీ చేశారో అసెంబ్లీ లో చర్చ చేద్దాం, ఏ బిల్లా రంగా వస్తారో రండి. రూ.18,500 కోట్ల ఆదాయం ప్రతి నెలా వస్తోంది. రూ.6,500 కోట్లు జీతాలు, పెన్షన్లకే పోతోంది. రూ.6వేల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నాం. రూ.5,500 కోట్ల ఆదాయం మాత్రమే మిగిలితే రుణమాఫీ చేసి ఇతర సంక్షేమ పథకాలకు వాడుతున్నాం’’ అని వివరించారు.

ప్రజల కోసమే శ్రమిస్తున్నాం

‘‘కడుపు కట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నాం. మూడు సార్లు ఓడినా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పాత్ర బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలి. నువ్వు బయటకు రావు, ఇద్దరు చిల్లరగాల్లను పంపుతున్నావు. కేటీఆర్ ఇయ్యాల, రేపు కిషన్ రెడ్డి మాట్లాడుతారు. మూసీ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. 60 ఏళ్ల ఆకాంక్షను, 1200 మంది బలిదానాలను చూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. సోనియమ్మ మా అమ్మ, 4కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మ. సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్ళు పోసుకోవాలి. కిషన్ రెడ్డికి తెలంగాణలో బతికే హక్కు లేదు. నరేంద్ర మోడీకి గులాం గిరీ చేసే కిషన్ రెడ్డి తట్టా, బుట్ట సర్దుకొని గుజరాత్ వెళ్లిపోవాలి. సోనియమ్మ లేనిదే తెలంగాణ లేదు. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. కాళోజీ స్ఫూర్తిగా తెలంగాణ ద్రోహులను పాతరెయ్యాలి’’ అని మండిపడ్డారు.

Tags:    

Similar News