Rythu Barosa Scheme | ఐదు ఎకరాలకే రైతు భరోసా ఇవ్వండి,సీఎంకు ఫోరం వినతి
రైతు భరోసా పథకాన్ని 5 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచించింది. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.;
By : The Federal
Update: 2025-01-03 14:00 GMT
తెలంగాణలో రైతుభరోసా పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసింది.
కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన పథకం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 10 వేల రూపాయలు సహాయం ప్రకటించారని, రైతులకు కావాల్సిన ఎరువులపై సబ్సిడీలు ఇస్తూ,ఎరువుల ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది.కేంద్రం పంటల భీమా (ఫసల్ భీమా ) పథకం ద్వార రైతులను పంట నష్టపోయినప్పుడు ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంది.
రాష్ట్రంలో ఉచిత కరెంటు సరఫరా
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంది.రైతులు మరణిస్తే , రైతుబీమా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.రైతులకు రెండు లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేశారు.సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయిల చొప్పున బోనస్ ఇస్తున్నారు.
గతంలో పడావు భూములకు రైతు బంధు
‘‘గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు 10 వేల రూపాయిల చొప్పున ఆర్థిక సహాయం ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా, వ్యవసాయం చేయని పడావు భూములకు అలాగే వందల ఎకరాలు ఉన్న పెద్ద రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించడంతో ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడింది.దీనివల్ల దుష్ట సంప్రదాయానికి తెర లేపినట్లయింది’’అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు.
వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుంది,కాని అమలులో అన్ని పడావు భూములకు పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా రైతుబంధు ఇచ్చారని పద్మనాభరెడ్డి చెప్పారు. అన్నంపెట్టే అన్నదాతలను ఆదుకునే అవసరం ఎంతో ఉన్నా, బడా భూస్వాములు ఆదాయపు పన్ను కట్టే శ్రీమంతులను ఈ పథకం నుంచి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. అలాగే కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాలు 50శాతం లోపే ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ సింహభాగం రైతు సంక్షేమానికి ఖర్చు పెడితే మరి మిగిలిన వారి సంగతేంటని పద్మనాభరెడ్డి ప్రశ్నించారు.ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా పథకాన్ని 5 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.