ప్రభుత్వాన్ని నిలదీసిన స్మితా సబర్వాల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి 400 ఎకరాల వివాదంలో నోటీసులు అందుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు;

Update: 2025-04-19 10:05 GMT
IAS Officer Smita Sabarwal

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి 400 ఎకరాల వివాదంలో నోటీసులు అందుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు. భూమి వివాదానికి సంబంధించిన ఒక పోస్టును స్మిత రీపోస్టుచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేట్లుగా ఉన్న పోస్టును ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న స్మిత(Smita Sabarwal) రీపోస్టు చేయటంతప్పని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే గచ్చిబౌలి పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం(బీఎన్ఎస్ఎస్) చట్టం, సెక్షన్ 179 కింద సమాధానం చెప్పాలని ఐఏఎస్ అధికారికి ఈనెల 12వ తేదీన నోటీసులు జారీచేశారు. నోటీసు అందుకున్న వారంలోగా విచారణకు హాజరవ్వాలని చెప్పటంతో ఈరోజు ఆమె పోలీసుల విచారణకు హాజరయ్యారు.

విచారణలో పోలీసులు ఏమడిగారు ? స్మిత ఏమి సమాధానం చెప్పిందన్నది పూర్తి గోప్యంగా ఉంది. ఈ విషయాన్ని వదిలేస్తే విచారణ పూర్తవ్వగానే స్మిత పెట్టిన పోస్టు ఇపుడు సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఏముందంటే ‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాను’ అనుంది. ‘పోలీసులకు పూర్తిగా విచారణలో సహకరించా..నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు..హాయ్ హైదరాబాద్ లో వచ్చిన పోస్టును మాత్రమే రీపోస్టు చేశాను’ అని చెప్పారు. ‘ఆ పోస్టును మొత్తం 2 వేలమంది షేర్ చేశారు’ అని కూడా చెప్పారు. ‘వాళ్ళందరినీ తనను విచారించినట్లే విచారిస్తారా’ అని అర్ధమొచ్చేట్లుగా పోస్టులో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇలాగే ‘నోటీసులు ఇచ్చి వారందరిపైనా చర్యలు తీసుకుంటారా’ అని నిలదీశారు. ‘అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది’ అన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు. ‘న్యాయం అన్నది అందరికీ సమానంగా ఉండాలి..చట్టం అందరికీ సమానమేనా ? లేకపోతే ఎంపికచేసిన వారినే టార్గెట్ చేస్తారా’ ? అని ప్రశ్నించారు. ఇపుడు ప్రశ్నించటమే కాదు ఇంతకుముందు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ట్విట్టర్(Twitter) ఖాతాలో రెండు పోస్టులు చేసిన విషయం తెలిసిందే. ఏదేమైన స్మితా సబర్వాల్ వ్యవహారం ఇపుడు ప్రభుత్వంతో పాటు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమవుతోంది.

Tags:    

Similar News