‘శ్రావణ మాసం’లో ఎన్ని రోజులు ముహూర్తాలు ఉన్నాయో తెలుసా..!
ఈ 16 రోజుల్లో మిస్ అయిందంటే మళ్ళీ శూన్యమాసం ముగిసే వరకు మరో ముహూర్తం లేదు.;
‘శ్రావణ మాసం’ మొదలైంది. ఈ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు వ్రతాలు, ప్రత్యేక పూజలు అనేకం చేస్తారు. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి.. ఈ మాసాన్ని శ్రావణమాసం అని అంటారు. ఈ మాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఈ మాసంలో పెళ్ళిళ్లు కూడా అధికంగా జరుగుతాయి. గతేడాది శ్రావణ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా పెళ్ళిళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా పెళ్ళిళ్ల సంఖ్య లక్షకు పైగా ఉండొచ్చని పురోహితుడు సీహెచ్. ఉపేంద్ర అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 25 నుంచి ఆగస్టు 23 వరకు ఉంది. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ వరకు శూన్యమాసం ఉంది. దీంతో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న వారంతా కూడా ఈ శ్రావణ మాసంలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. అందుకోసం ఈ మాసంలో ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయని చూసుకుంటున్నారు. ఈ మాస రోజుల్లో మొత్తం 16 రోజుల్లో శుభప్రదమైన ముహూర్తాలు ఉన్నాయి. ఈ 16 రోజుల్లో మిస్ అయిందంటే మళ్ళీ శూన్యమాసం ముగిసే వరకు మరో ముహూర్తం లేదు.
జులై నెలలో 26, 30, 31 తేదీల్లో అత్యధికంగా పెళ్ళిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితుడు రాఘవేంద్ర శర్మ చెప్పారు. ఇక వచ్చే నెల ఆగస్టులో చూసుకుంటే 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 21వ తేదీల్లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఈ రోజులు మిస్ అయితే మళ్ళీ సెప్టెంబర్ 23, 24, 26, 27, 28 వరకు పెళ్ళి ముహూర్తాలు లేవని వెల్లడించారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లలో కూడా ఎక్కువగానే మంచి ముహూర్తాలు ఉన్న రోజులు ఉన్నాయన్నారు.
బిజీ బిజీగా ఫంక్షన్ హాల్స్..
శ్రావణ మాసంలో భారీగా పెళ్ళి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్‌కు భారీ బిజినెస్ అవుతోంది. ఇప్పటికే నెల మొత్తానికి బుకింగ్స్ అయిపోయాయని కూకట్‌పల్లిలోని భ్రమరాంబ అండ్ మల్లికార్జున ఫంక్షన్ హాల్ యజమాని కృష్ణమూర్తి చెప్పారు. ఇప్పటికీ చాలా మంది ఇంకా బుకింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నెల రోజుల ముందు నుంచే ఈ తేదీల్లో బుకింగ్స్ మొదలయ్యాయని తెలిపారు. వీటితో పాటుగా జ్యూవెలరీ షాప్స్ కూడా భారీ బిజినెస్‌ను చూసే అవకాశం ఉంది. పెళ్ళిళ్లు అధికంగా జరుగుతున్నాయంటే.. తమ వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని జైన్ జ్యూవెలరీ షాప్ యజమాని పరాస్మల్ జైన్ చెప్పారు. ప్రస్తుతానికి తాము ఫుల్ బిజీ అయ్యామని అన్నారు. ఎంత వ్యాపారం జరిగిందో ఆయన చెప్పలేదు కానీ.. ఊహించిన దానికంటే ఎక్కువగానే జరిగిందని పరాస్మల్ పేర్కొన్నారు.
అంతా సన్నద్ధం..
శ్రావణ మాసం సందర్భంగా పెళ్ళి బాజాలు మోగించడానికి చాలా మంది సిద్ధం అవుతున్నారు. వారితో పాటు చిరువ్యాపారులు, క్యాటరింగ్ వాళ్లు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా రెడీ అవుతున్నారు. ఏ ఆర్డర్ వచ్చిన కాదు.. లేదు అనుకుండా ఉండేలా సిద్ధమవుతున్నామని, క్యాటరింగ్ వారు కుర్రవాళ్ల సంఖ్యను పెంచుతున్నామని మణికంఠ క్యాటరింగ్ యజమాని యేనుగంటి భాస్కర్ తెలిపారు. పాటు డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు కూడా ఫుల్ బిజీగా అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్లు సహా అనేక శుభకార్యాలను నిర్వహించే రుద్ర ఈవెంట్స్ కూడా ఈ శ్రావణ మాసంలో బుకింగ్స్ అధికంగానే ఉన్నాయని వెల్లడించారు. రుద్ర ఈవెంట్స్ యజమాని రవి రుద్ర మాట్లాడుతూ.. తమ సంస్థ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా అప్రోచ్ అవుతున్నాయని చెప్పారు. పెళ్ళిళ్ల సీజన్ కావడంతో ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదే విధంగా పెళ్ళి వేడుకల్లో తమ అవసరం ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో రెండు చేతులా పనిని సంపాదించడానికి రెడీ అవుతున్నారు.
శ్రావణ మాసం పెళ్ళిళ్లకు ప్రాధాన్యత ఎందుకు..!
శ్రావణ మాసంలో ప్రతి రోజు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో గొప్ప ఫలితాలను అందింస్తాయని నమ్మకం. శ్రావణ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది పెళ్ళి. ఎందుకంటే ఈ మాసంలో అధికంగా పెళ్ళిళ్లు జరుగుతాయి. అసలు ఈ మాసంలో పెళ్ళిళ్లకు అంత విశిష్టత రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. స్థితికారుడైన శ్రీమహావిష్ణువు, ఆయన సతీమణి శ్రీమహాలక్ష్మీకి ఈ మాసం అంటే ఎంతో ప్రీతి. ఈ మాసంలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టే వారికి వారి ఆశీర్వచనాలు అందుతాయనేది నమ్మకం. అంతే కాకుండా ఈ మాసంలో శివపార్వతులను కూడా ఎంతో విశిష్టంగా పూజిస్తారు. ఈ మాసంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టే వారికి అటు విష్ణు దంపతులు, ఇటు శివ దంపతుల ఆశీర్వాదం లభిస్తుందని, ఆ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా కలకాలం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో జరిగే పెళ్ళిళ్లకు ఎంతో విశిష్టత ఉంది.