ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే..అప్పటికే అంతా అయిపోయింది

కూల్చివేతపై తనకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇవ్వటం ఒక్కటే ఊరట లభించే అంశం. కాకపోతే అప్పటికే కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా నూరుశాతం కూల్చివేసింది.

Update: 2024-08-24 09:54 GMT
N convention

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీనటుడు అక్కినేని నాగార్జునకు పెద్ద ఊరట లభించింది. ఎలాగంటే వెంటనే కూల్చివేతను నిలిపేయాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. శనివారం ఉదయం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేత మొదలుపెట్టింది. దాంతో ఆఘమేఘాల మీద నాగార్జున హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. కేసును విచారించిన హైకోర్టు సుమారు 2 గంటల ప్రాంతంలో స్టే విధిస్తు ఆదేశాలిచ్చింది.

అయితే అప్పటికే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పూర్తయిపోయింది. ఉదయం నుండి ఐదుగుంటల్లోనే మొత్తం కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా నేలమట్టం చేసేసింది. కూల్చివేతపై తనకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇవ్వటం ఒక్కటే ఊరట లభించే అంశం. కాకపోతే అప్పటికే కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా నూరుశాతం కూల్చివేసింది. సెంటర్ మొత్తాన్ని కూల్చేసిన తర్వాత కూల్చివేతలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించినా ఒకటే ఆదేశించకపోయినా ఒకటే.

ఎవరి వాదన కరెక్టు ?

కూల్చివేతపై నాగార్జున ట్విట్టర్లో స్పందించారు. కన్వెన్షన్ సెంటర్ మొత్తం పట్టాభూమిగా చెప్పారు. తాను చెరువును ఆక్రమించి నిర్మాణం చేశానని అనటంలో నిజంలేదన్నారు. తనను కబ్జాదారుడిగా చిత్రీకరించటం తనకు చాలా బాధేసిందన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నాగార్జున చెప్పారు. తాను చెరువును కబ్జాచేసి నిర్మాణం చేశానని నిర్ధారణ అయితే తానే సెంటర్ ను కూల్చివేస్తానని కూడా చెప్పారు. తాను ఆక్రమణదారుడిని కానని జనాలకు చెప్పుకోవటమే తన ఉద్దేశ్యమని నాగార్జున ట్విట్టర్లో స్పష్టంచేశారు.

చెరువు పక్కనే నాగార్జునకు స్థలం ఎలా దొరికిందో అర్థం కాదు. చెరువులో  వెలసిన కన్వెషన్ సెంటర్ గురించి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయి నాగార్జున వాదనను బలహీనపరుస్తున్నాయి




ఇదే సమయంలో హైడ్రా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా చెరువును ఆక్రమించుకుని కట్టిందే అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే కూల్చివేసినట్లు సమాచారం. చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ ను నాగార్జున నిర్మించారని చాలా సంవత్సరాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్ర వైఎస్సార్ హయాంలోనే కాకుండా కేసీఆర్ హయాంలో కూడా కన్వెన్షన్ సెంటర్ కూల్చేయాలనే విషయమై కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఏ కారణంవల్లో మళ్ళీ ప్రభుత్వాలు వెనక్కుతగ్గాయి. సంవత్సరాలుగా వివాదాల్లోనే ఉన్న కన్వెన్షన్ సెంటర్ ఇపుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం కూలిపోయింది.

Tags:    

Similar News