హన్మకొండ సీఎం పర్యటన అడ్డుకుంటాం, విద్యార్థి సంఘాల హెచ్చరిక

హన్మకొండలో ఈ నెల 19వతేదీన సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి నేతలు హెచ్చరించారు.కళాకారులకు స్థానం లేకుండా కళాక్షేత్రం ఆవిష్కరిస్తున్నారన్నారు.

Update: 2024-11-18 00:20 GMT

కాళోజీ నారాయణరావు కళాక్షేత్రం ఏర్పాటులో కులవివక్ష చూపిస్తే సహించేది లేదని వరంగల్ జిల్లా విద్యార్థి సంఘం నేతలు హెచ్చరించారు.అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడారు.ఎస్ఐఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్ మాట్లాడుతూ,వరంగల్ కళా క్షేత్రానికి కళలకు,కళారూపాలకు సంబంధంలేని కాళోజి నారాయణరావు పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

- ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ జిల్లా బాలసముద్రంలో రూ.100 కోట్లతో నిర్మించిన కళాక్షేత్రంలో కళాకారులకు స్థానం లేకుండా,కళాకారుల విగ్రహాలు లేకుండా ఆవిష్కరణకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

కళాకారుల విగ్రహాలు పెట్టండి
గత నాలుగు నెలలుగా కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలను పెట్టాలని,కళాక్షేత్రానికి కళాకారుల పేర్లతో నామకరణం చేయాలని తాము ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యేను, కలెక్టరును కమిషనర్ ను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

కళాకారులను విస్మరించొద్దు
మేధావులు,కళాకారులు, కుల, ప్రజాసంఘాల నాయకులు అందరూ కలిసి కళాక్షేత్రంలో కళాకారులను గౌరవించాలని,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసిన కళాకారులను విస్మరించడం సరైంది కాదని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు వాపోయారు. కళాకారుల విగ్రహాలను పెట్టకపోవడం వెనుక కచ్చితంగా కుల వివక్ష కనిపిస్తుందని వారు ఆరోపించారు.

కులవివక్ష చూపితే కాంగ్రెస్ ను ఓడిస్తాం
కాళోజి నారాయణరావు ఆధిపత్య వర్గానికి సంబంధించిన వ్యక్తి గనుకనే కళాక్షేత్రంలో కలలకు సంబంధం లేకపోయినా ఆయన విగ్రహాన్ని, ఆయన పేరును నామకరణం చేశారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఓట్లతో వరంగల్ నగరంలో కాంగ్రెస్ గెలిచిన ప్రభుత్వం నేడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ల కళాకారులను ప్రజల డిమాండ్లను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాపాలన పేరు చెప్పి కులవివక్ష చూపితే, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని వారు హెచ్చరించారు.

కాళోజీ పేరు ఎందుకు?
తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్ మాట్లాడుతూ,గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ ను టీజీగా, తెలంగాణ చిహ్నాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన ప్రభుత్వం,కాళోజి పేరును ఎందుకు మార్చడం లేదని సునీల్ ప్రశ్నించారు. అంతేకాకుండా వరంగల్ లో ఇప్పటికే కాలోజీ పేరుతో మెడికల్ యూనివర్సిటీ ఉందని, కాళోజి విగ్రహం ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య రంగంలో కాళోజి పేరు మీద అవార్డులను ఇస్తుందని, అదేవిధంగా భాషా దినోత్సవం కాళోజి పుట్టినరోజునే జరుపుకుంటున్నామని, అయినా కూడా కళాక్షేత్రాన్ని ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.

ఇది కుల వివక్షే...
ఖచ్చితంగా ఇది కుల వివక్షేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెబుతూ, మరోపక్క కుల వివక్షను చూపిస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలను పెట్టడానికి గాని, ఆ కళాక్షేత్రానికి కళాకారుల పేర్లతో నామకరణం చేయడానికి గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోతే,ఆయన పర్యటన ఖచ్చితంగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.అవసరమైతే కళాక్షేత్రం ముందు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి స్పందించకపోతే రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విద్యార్థి నాయకులు తెలిపారు. గద్దర్,గూడ అంజన్న,మిద్దె రాములు,చిందు ఎల్లమ్మ,చుక్కా సత్తయ్య,శంకరన్న,సారంగపాణి,నేరెళ్ల వేణుమాధవ్ వంటి కళాకారులను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు.

ఉద్యమిస్తాం
పోలీస్ అధికారులు కూడా సహకరించాలని ముందస్తు అరెస్టులు చేస్తే ఊరుకోమని, రాష్ట్రవ్యాప్తంగా కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలు పెట్టేంత వరకు కళాకారుల పేర్లతో నామకరణం చేసేంతవరకు పోరాడుతామని ఒకవేళ ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా మేధావులను కళాకారులను, కుల సంఘాల నాయకులను, ప్రజాసంఘాల నాయకులను అందరినీ ఏకం చేసి ఉద్యమిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్, అక్రమ్, కుమార్,నాని, అర్జున్,ప్రణయ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News