కవిత పిటిషన్ డిస్మిస్.. ఏం జరగబోతోంది ?

తన అరెస్ట్ అక్రమమంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

Update: 2024-03-22 06:14 GMT
Source: Twitter

కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమమని కవిత వాదిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారంటూ కవిత ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌ను రద్దు చేసింది. కేసు విచారణ జరుగుతున్న ట్రైల్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు  సంజీవ్ ఖన్నా, ఎం ఎం సుందరేష్, బేలా  ఎం త్రివేది ఉన్నారు. పిటిషన్ లో పేర్కొన్నవి న్యాయసమ్మతమవునా కాదా అనే అంశం జోలికి వెళ్లకుండా బెయిల్ కోసం ట్రయల్ కోర్టు (రౌస్ ఎవెన్యూ కోర్టు) కు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.

కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. కవిత బెయిల్ విషయాన్ని సుప్రీంకోర్టులో నిర్ణయించాలని, కోర్టు తిరస్కరించినా పర్వాలేదాగాని హైకోర్టుకు వెళ్లాలన్న ఆదేశాలు ఇవ్వరాదని సిబల్ వాదించారు.

" ఈ దేశంలో ఏం జరుగుతున్నదో చూడండి. అప్రూవర్లు ఏమి చెబుతున్నారో చూడండి. న్యాయవాదిగా నేను ఆందోళన చెందుతున్నాను," అని సిబల్ అన్నారు.

అయితే, కోర్టు దీనికి సమాధానమిస్తూ, ఆవేశాలకు లోనుకావద్దని సిబల్ కు సలహా ఇచ్చింది.

ఇదే సందర్భంగా ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో కవిత లేవనెత్తిన ప్రశ్నలకు 6 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపింది. అలాగే మహిళ కాబట్టి వీలైనంత తొందరగా విచారణ ముగించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.

ఇక్కడ విషయం ఏమిటంటే ఈడీ తనను అరెస్టు చేయకుండా కవిత చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. దాదాపు ఏడాది క్రితం రెండు రోజులు విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు కవిత వెళ్ళారు. ఆ తర్వాత నుండి ఈడీ ఎన్ని నోటీసులు ఇచ్చినా కవిత విచారణకు హాజరు కాలేదు.

విచారణకు హాజరుకాకపోగా తాను మహిళలను కాబట్టి ఆఫీసుకు పిలిపించి ఈడీ తనను విచారించకూడదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవైపు పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే కవితను ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసి అదే రోజున ఢిల్లీకి తరలించింది. లిక్కర్ స్కాం అని కాకుండా మనీల్యాండరింగ్ ఆరోపణలపై కవితను అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. దాంతో కవిత మరోసారి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్‌లో కవితను అరెస్టుచేసి ఢిల్లీకి తరలించటంలో ఈడీకి చట్టబద్దమైన అధికారాలున్నాయని కోర్టు స్పష్టంగా తేల్చేసింది. అన్ని నిబంధనలను పాటించిన తర్వాతే కవితను ఈడీ అరెస్టు చేసినట్లు ఈడీ కోర్టు అభిప్రాయపడింది.

దాంతో మళ్ళీ మరో పిటిషన్ వేయటమే కాకుండా తాను మహిళను కాబట్టి ఆఫీసులో ఈడీ అరెస్టు చేయడానికి లేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేసింది. ట్రయల్ కోర్టులోనే తన వాదనలను వినిపించాలని కవితకు చెప్పింది. దాంతో కవిత ట్రైల్ కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ఈడీ అరెస్టు చేయకటపోవడం లాంటి అంశాలు కీలకంగా పనిచేశాయి. కవితను ఈడీ అరెస్టు చేయకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందాలుండటమే అని కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రచారం చేశారు. దాన్ని జనాలు కూడా నమ్మారు. బీఆర్ఎస్ ఓటమికి దారి తీసిన అనేక కారణాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ప్రజలు నమ్మడమే అని స్వయంగా బీఆర్ఎస్ నేతలు పార్టీ అంతర్గత విశ్లేషణల్లో అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేయకుండా బీఆర్ఎస్, బీజేపీ దెబ్బతిన్నాయి. ఇపుడేమో పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన కవిత అరెస్టు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. కవిత అరెస్టు తాలూకు సానుభూతిని క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కవిత అరెస్టు కారణంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని బీజేపీ చెబుతోంది. పైకి ఎన్ని చెప్పినా రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ తన ఆరోపణలను పెంచేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News