బీసీ రిజర్వేషన్లపై పిటీషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
హైకోర్టులో కేసు పెండింగ్ లో వుండగా సుప్రీం కోర్టుకు ఎందుకన్న ధర్మాసనం
By : V V S Krishna Kumar
Update: 2025-10-06 08:36 GMT
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.హైకోర్టులో ముందు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పిటీషన్ను విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.దాంతో తెలంగాణ బీసీ రిజర్వేషన్లు 42 శాతం పై అత్యున్నత న్యాయస్థానం ఏమి చెబుతుందా అన్న సస్పెన్స్ కు తెరపడింది.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త జీవో తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు తుది తీర్పు 8న వెల్లడిస్తామని వాయిదా వేసింది.ఈ నేపధ్యంలోనే సుప్రీం కోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని , అవి రాజ్యాంగ వ్యతిరేకమని పీటీషనర్లు కోరారు. ఈ పిటీషన్లు ఈరోజు బెంచ్ మీదకు రాగా వాటిని ధర్మాసనం కొట్టి వేసింది.
హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ సింఘ్వీ, ఏడీఎన్ రావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కొట్టివేసింది.ముందు విషయం హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది.