హెచ్‌సీయూ వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్

తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది.;

Update: 2025-04-03 11:01 GMT

హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అక్కడ జరుగుతున్న పనులను ఆపేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిలతో కూడి ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ అందించిన నివేదికను పరిశీలించిన అనంతరం చట్టాన్ని మీరెలా చేతుల్లోకి తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. అంతేకాకుండా కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి చీఫ్ సెక్రటరీని బాధ్యులను చేస్తామని కూడా న్యాయస్థానం చెప్పింది. అయితే ఈ భూముల వివాదానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను అందించారు. ఆ నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది.

గురువారం ఉదయం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ భూములపై నివేదిక అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిలతో కూడి ధర్మాసనం ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ తన మధ్యంతన నివేదికను అందించారు. అందులో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. ఆ స్థలం 30 ఏళ్లుగా వివాదాల్లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా అది అటవీ భూమి అని ఆధారాలు ఏమీ లేవని తెలిపారు. దాదాపు 100 ఎకరాలను చదును చేసి పనులను చేపట్టడానికి సరిపడా యంత్రాంగం ఆ ప్రాంతంలో ఉన్నట్లు రిజిస్ట్రార్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలరోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేసిన ఆ భూములను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కంచె గచ్చిబౌలి వ్యవహారంలో సీఎస్‌ను ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. అదే విధంగా ఆఘమేఘాలపైన అక్కడ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ 400 ఎకరాలు అటవీ భూమి కాకపోయినా.. భారీ ఎత్తున చెట్లు కొట్టేయడానికి సీఎస్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. గచ్చిబౌలి భూముల్లో పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఆ ప్రాంతంలో విస్తృతంగా వృక్షసంపద నిర్మూలన జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. దాదాపు 100 ఎకరాలను డెవలప్‌మెంట్‌కు సిద్ధం చేసేటంత యంత్ర సముదాయం అక్కడ మోహరించి ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులను అక్కడ ఉన్న వన్యప్రాణులను ప్రభావితం చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. 1932 నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆరు నెలల్లోగా ఆ ప్రాంతంలో పరిశీలన అంచనా పనులను పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం.. కమిటీని ఏర్పాటు చేసిన రెండు రోజులకే గచ్చిబౌలి భూముల్లో పనులను ప్రారంభించేసింది. ప్రభుత్వం కనబరుస్తున్న ఈ తొందరపాటును న్యాయస్థానం ప్రశ్నించిందని, దీనిని రె:కంచ గచ్చిబౌలి ఫారెస్ట్‌ అనే పేరుతో సుమోటో రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని న్యాస్థానం ఆదేశాలు జారీ చేసింది. సరైన పిటిషన్ సిద్ధం చేయాలని ఆదేశించింది. అదే విధంగా ఈ వ్యవహారంలో అన్ని అనుమతులను పొందారా లేదా వంటి క్లిష్టమైన అంశాలను ప్రస్తావిస్తూ వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌ను ఆదేశించింది.

Tags:    

Similar News