మంద కృష్ణకు 'పోటు', తమిళ తంబి అన్నామలైకి సీటు
బీజేపీ చక్రం తిప్పింది. మంద కృష్ణకు సీటు లేకుండా పోయింది. రాజకీయాలలో పరిచయాలు కన్నా అవసరాలే మిన్న అని చంద్రబాబు మరోసారి నిరూపించారంటున్నారు మంద కృష్ణ అనుచరులు.;
By : The Federal
Update: 2025-04-24 13:06 GMT
మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అవ్యాజమైన ప్రేమను కురిపించారు. ఆలింగనాలు, అలాయ్ బలాయ్ లు, మిఠాయిలు, శాలువలు, సత్కారాలు.. ఇలా బోలెడన్ని జరిగినా- ఎక్కడైనా భావే కాని వంగతోట కాదన్నట్టయింది- మంద కృష్ణ పరిస్థితి. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న కల ఈసారి కూడా నెరవేరేలా లేదు. ఊరించిన రాజ్యసభ సీటు ఉసూరనిపించింది. ఢిల్లీలో ఏమి జరిగిందో తెలియదు కాని ఈసారి తెలుగువాడైన మంద కృష్ణను కాదని తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే పని దాదాపు ఖరారైంది. మంద కృష్ణకు నిరాశే మిగిలింది.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున ఎన్నికైన వి.విజయసాయిరెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ సీటు విషయాన్ని చర్చించేందుకు- విదేశీ పర్యటన నుంచి నేరుగా ఢిల్లీలో వచ్చిన సీఎం చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. వీరి భేటీకి ముందే ఢిల్లీ చేరిన మంద కృష్ణ మాదిగ అటు బీజేపీ ఇటు టీడీపీ నాయకులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. చివరిగా చంద్రబాబును కలిసి శాలువా కప్పి, కప్పించుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
మంద కృష్ణ చీరాలకు సమీపంలోని పందిళ్లపల్లి నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి చంద్రబాబుతో పరిచయం ఉంది. ఎస్సీ వర్గీకరణకు తొలుత సుముఖత వ్యక్తం చేసింది కూడా చంద్రబాబే. ఆ తర్వాత ఆ ఉద్యమం అనేక మలుపులు తిరిగి చివరికి 2025లో తొలుత తెలంగాణలో ఆ తర్వాత ఆంధ్రలో అమలుకు సన్నద్ధమవుతోంది. ఆనాటి పీపుల్స్ వార్ తో సన్నిహిత సంబంధాలున్న మంద కృష్ణ తన ఉద్యమ కాలంలో బీజేపీకి కూడా దగ్గరయ్యారు. బండారు దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి వంటి పెద్ద నేతలతో పరిచయాలు, స్నేహాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే మంద కృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా సన్నిహితులుగా మారారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది కాలం ముందు మంద కృష్ణ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మాదిగల శంఖారావం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం గమనార్హం.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాదిగలకు న్యాయం చేసే పేరిట ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు ఉద్యమించి సాధించిన నేతగా మంద కృష్ణ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్షపార్టీలకు ఇష్టుడైన మంద కృష్ణకు ఏదో ఒక పదవి ఇస్తారనే టాక్ కూడా నడిచింది.
ఇప్పటికే బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యను చంద్రబాబు 2014లో టీడీపీ తరఫున హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ తర్వాత వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు. 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీ సభ్యత్వానికీ, రాజ్యసభ మెంబర్ షిప్ కి రాజీనామా చేసి అనూహ్యంగా బీజేపీ తరఫున మళ్లీ ఏపీ రాజ్యసభకు వెళ్లారు. సరిగ్గా ఈ నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితీ నాయకుడు మంద కృష్ణకు రాజ్యసభ సీటు ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించారు. దానికనుగుణంగా పావులు కదిపారు. మామూలు పరిస్థితుల్లోనైతే బీజేపీ అగ్రనాయకత్వం కూడా మంద కృష్ణ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపి ఉండేదే. ఒక బీసీ నేతను తమ బుట్టలో వేసుకున్నట్టే మరో ఎస్సీ నేతను కూడా తమ ఖాతాలో కలిపేసుకుని తాము బీసీలను, ఎస్సీలను సమానంగా గుర్తిస్తామని చెప్పుకునేదే. కాని ఈసారి ఆ పార్టీకి ఈ ఎస్సీని కాదనాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఏమిటా అనివార్య పరిస్థితి?
ఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai)తో ఆ పదవికి రాజీనామా చేయించింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ త్యాగం చేయాల్సి వచ్చింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించడంతో ఆయన్ను అనివార్యంగా తొలగించాల్సి వచ్చింది. ఆ సందర్భంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం గానీ కేంద్ర ప్రభుత్వంలో ఓ నామినేటెడ్ పదవి గాని ఇస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీనికి ఆయన సమ్మతించిన తర్వాత బీజేపీ తమిళనాడు యూనిట్ అధ్యక్షుడిగా నయినర్ నాగేంద్రన్ ను నియమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి అన్నామలైకి హామీ కూడా లభించింది.
ఐపీఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అన్నామలైను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా లేదా ప్రధాన కార్యదర్శిగా నియమించవచ్చని తొలుత భావించినా చివరకు ఆయన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఢిల్లీలో చంద్రబాబుతో జరిగిన చర్చల్లో అమిత్ షా ఈ ప్రతిపాదనే చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు మంద కృష్ణ పేరు చెప్పారని, దానికి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైకి రాజ్యసభ సీటు ఇవ్వడం ప్రధానమని బీజేపీ భావిస్తున్నట్టు వివరించారు. ఆ తర్వాత అన్నామలై పేరునే దాదాపు ఖరారు చేశారు. మంద కృష్ణకు కూడా త్వరలో ఏదో ఒక పదవి ఇద్దామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలిసింది.
దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఉనికి పెరగాలంటే అన్నామలై వంటి నాయకులు అవసరమని బీజేపీ భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఓట్ల వాటా 3% ఉంటే 2024 పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నామలై నాయకత్వంలో 11%కి పైగా పెరిగింది. అన్నామలై వాదన ప్రకారం తమిళనాడులో "బిజెపి ఒంటరిగా పోటీ చేయాలి. కానీ దానివల్ల ఓట్లు మరిన్ని పెరగవచ్చునేమో గాని పార్టీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం కాబోదన్నది బీజేపీ అగ్రనాయకత్వం వాదన" అని ఒక సీనియర్ నాయకుడు అన్నారు. అటువంటి నాయకుడికి ఏదో ఒక పదవి ఇవ్వకపోతే బీజేపీ క్యాడర్ డీలా పడతారని పార్టీ నాయకత్వం భావించింది. మంద కృష్ణ కన్నా అన్నామలైకే పెద్దపీట వేసింది. పైగా అన్నామలై, అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి గౌండర్ కులానికి చెందినవారు. అందువల్ల తమిళనాడులో అన్నామలై సీఎం అయ్యే అవకాశాలు తక్కువ అని పార్టీ అంచనా వేస్తోంది.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కూడా అన్నామలై అభ్యర్థిత్వం పట్ల సానుకూలత వ్యక్తమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్సీ నాయకుడైన మందా కృష్ణ మాదిగకు అవకాశం కల్పించాలని కొన్ని వర్గాలు తీవ్రంగా కోరుతున్నప్పటికీ, బీజేపీదే అల్టిమేట్ డెసిషన్ అయింది.
వివాదానికి దారితీస్తుందా?
మంద కృష్ణ మాదిగకు ఈ అవకాశం దక్కకపోతే, మాదిగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగే అవకాశం ఉంది. గతంలో ఆయన తమ వర్గం తరఫున రాజకీయ హక్కుల కోసం ఉద్యమాలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తాజా పరిణామంపై టీడీపీ, జనసేన నుంచి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడనప్పటిటీ తమిళనాడు నేతను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం రాజకీయంగా ఏ మేరకు ఈ పార్టీలకు లాభదాయకమన్న చర్చ ప్రారంభమైంది.
ఇప్పటి వరకు మంద కృష్ణ మాదిగ ఈ విషయమై స్పందించకపోయినప్పటికీ, ఆయన అనుచరులు ఆత్మీయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.