ఎన్నికల్లో పోటీపై తమిళిసై క్లారిటీ.. బరిలో దిగేది ఎక్కడ నుంచి?

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తి చూపుతున్నారు. ఆమెను కన్యాకుమారి నుంచి బరిలోకి దించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Update: 2024-03-04 13:30 GMT
Source: Twitter


పార్లమెంటు ఎన్నికల కోసం దేశంలోని పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల బరిలో నిలబడటానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల బరిలో తమిళిసై పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగొచ్చు? అనే అంశాలు కొన్ని రోజులుగా చర్చల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తమిళిసై స్పష్టత నిచ్చారు. ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని, బీజేపీ హైకమాండ్ అవకాశం కల్పిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధమని వెల్లడించారు.

అయితే తమిళిసై గత లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమిని చవి చూశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆతర్వాత 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. కాగా ఇప్పుడు మరోసారి లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఎన్నికల్లో పోటీ చేయడంపై తనకున్న ఆసక్తిని తమిళిసై మరోసారి కనబరిచారు.

కన్యాకుమారిపై బీజేపీ స్పెషల్ ఫోకస్

తమిళనాడులో బీజేపీకి గట్టి పట్టు ఉంది. 2024 ఎన్నికల్లో కన్యాకుమారి స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇక్కడి నుంచే తమిళిసైని నిలబెట్టాలని కూడా బీజేపీ జాతీయ నాయకులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వారు పార్టీ జాతీయ ఎన్నికల కమిటీతో చర్చలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారిలో నాడార్ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. తమిళిసై కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఈసారి ఎన్నికల్లో తమిళిసైని అక్కడి నుంచే నిలబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. కాగా కన్యాకుమారిలో కాంగ్రెస్ తరపున నాడార్ సామాజిక వర్గానికి చెందిన నటుడు విజయ్ వసంత్ పోటీ చేస్తున్నారు. అతనిపై పోటీకి తమిళిసై సరైన ప్రత్యర్థి అని, ఆమెను నిలబెడితేనే కన్యాకుమారి తమ చేయి దాటిపోదని బీజేపీ భావిస్తోంది.

దేవుడు కరుణిస్తే చూద్దాం: తమిళిసై

ఎన్నికల్లో పోటీపై తెలంగాణ గవర్నర్ తమిళిసై తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. ‘‘దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా లోక్‌సభ ఎన్నికల్లో తలపడతా. నేను బీజేపీ కార్యకర్తను మాత్రమే పార్టీ ఏం చెబితే అది చేస్తా, ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తాను. టికెట్ ఇవ్వాలని పార్టీని కోరను కానీ అవకాశం కల్పిస్తే తప్పకుండా పోటీ చేస్తా’’ అని ప్రకటించారు.

పుదుచ్చేరిలో తమిళిసైకి వ్యతిరేక

లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై పోటీపై నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో భాగంగా తమిళిసై పుదుచ్చేరి లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వార్తలు తీవ్రంగా ప్రచారం కావడంతో పుదుచ్చేరిలో తమిళిసైపై తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. ఆమెకు పుదుచ్చేరి టికెట్ ఇవ్వదంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఆ సమయంలో తమిళిసైని పుదుచ్చేరీలో ఒక బయటివ్యక్తి(తమ జాతికి చెందిన వ్యక్తి కాదు అన్న విధంగా)గా చూశారు. తాజాగా దీనిపై స్పందించిన తమిళిసై తాను బయట వ్యక్తిని కాదని వెల్లడించారు. ‘‘నేను పుదుచ్చేరిని ఎన్నడూ కూడా నాకు సంబంధం లేని ప్రాంతంగా భావించలేదు. ఎందరికో స్ఫూర్తిదాతలైన అర్బిందో, సుబ్రమనియా భారతి వంటి గొప్ప వ్యక్తులు పుట్టిన మహత్తర స్థలంగానే భావించాను. నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పట్లేదు. గవర్నర్ పదవికి లేదా ఎన్నికల్లో నేను పోటీ చేయడం అనేది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్లు చెప్పిన ప్రాంతం నుంచి పోటీకి నిలబడతా’’అని వెల్లడించారు.

పదవీకాలం ఉన్నా తమిళిసై రాజీనామా?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై చేత రాజీనామా చేయించి ఎన్నికల బరిలో దించాలని బీజేపీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తమిళిసైతో కూడా చర్చలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఎన్నికల పోటీపై తమిళిసై ఆసక్తి చూపుతుండటంతో.. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్దత మరికొన్ని రోజుల్లోనే వీడనుంది.
Tags:    

Similar News