Telangana | అప్పుల కన్నా వడ్డీల వాతే ఎక్కువ..!
నాలుగు నెలల్లో రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకున్న ప్రభుత్వం.;
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు ఆందోళకలిగిస్తుంటే.. మరోవైపు తీసుకుంటున్న అప్పులు భయపెడుతున్నాయి. తీసుకుంటున్న అసలు అప్పుల కన్నా వాటికి కట్టాల్సిన వడ్డీలు పీడకలల మాదిరి మారుతున్నాయి. వందరూపాయాలు కావాలని అప్పు తీసుకుంటే అందులో కటింగ్స్ పోను చేతికి వస్తున్నది 70రూపాయలే. ఈ తరహా ఆర్‌బీఐ కటింగ్స్‌తో అనుకున్న అప్పులు అంచనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అధిగమించేసేలా ఉంది. ఈ కోతలే ప్రభుత్వానికి కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ.30,900 కోట్ల రుణం తీసుకుంది. కానీ చేతికి వచ్చింది మాత్రం రూ.20,266 కోట్లే. మిగిలిన మొత్తాన్ని పాత అప్పుల అసలు, వాటికి వడ్డీల కింద ఆర్‌బీఐ తీసుకుంది. ఆయా మొత్తాలను సంబంధిత సంస్థలకు బదిలీచేసింది. దీని వల్ల ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితిలో సతమతమవుతోంది.
తప్పనిసరి ఖర్చులు, సంక్షేమ వ్యయాలు, జీతాల చెల్లింపులు, వడ్డీలు, రుణాల రీపేంట్లు , గ్రీన్ ఛానెల్ చెల్లింపులు ఇలా అన్ని ఖర్చులను తలుచుకుని సర్కార్ సతమతమవుతోంది. వీటన్నింటినీ సవ్యంగా కొనసాగించడం కోసం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణ ప్రభుత్వం అనుకున్న దానికన్నా అధికంగానే అప్పులు చేసింది. బడ్జెట్‌లో వేసిన అప్పులు అంచనా నాలుగునెలల్లోనే 50శాతాన్ని మించింది. బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణాలు తీసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ నాలుగు నెలల్లోనే అందులో రూ.30,900 కోట్ల రుణాలు తీసేసుకుంది. అయినా లాభం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ.4,400 కోట్లు, మే నెలలో రూ.4,500 కోట్లు, జూన్‌లో రూ.8,500 కోట్లు, జులైలో రూ.8,500 కోట్లు, ఆగస్టు నెలలో 5వ తేదీన రూ.5వేల కోట్ల రుణం తీసుకుంది.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం సరిపోతోందని సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు పలుసార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ అనివార్య పరిస్థితుల్లోనే మళ్ళీమళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని కూడా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే వడ్డీ భారం రోజురోజుకు అధికమవుతోంది. 2014-15లో అసలు, వడ్డీచెల్లింపులకు రూ.6,954 కోట్లు ఖర్చు చేస్తే 2023-24 నాటికి రుణ చెల్లింపు భారం రూ. 32,939 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ మొత్తం రుణాలు, వడ్డీల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నారు. ఐదు కార్పోరేషన్లు తీసుకున్న అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ కార్పోరేషన్లకు తీసుకున్న అప్పులకు 8.93 శాతం నుండి 10.49 శాతంగా చెల్లింపులున్నాయని ప్రభుత్వం చెబుతోంది.