బిసి ఉద్యమకారుడు ప్రొ. ప్రభంజన్ ఇక లేరు...
బిసి ఉద్యమానికి తీరని లోటు అంటున్న ఉద్యమకారులు;
తెలంగాణలో వెనకబడిన కులలాను ఒక వేదిక మీదికి తెచ్చి సామాజిక న్యాయ ఉద్యమం నిర్మించేందుకు నిరంతర పనిచేసిన ప్రొఫెసర్ వై ప్రభంజన్ యాదవ్ ఈ ఉదయమం హైదరాబాద్ లో మరణించారు. ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, కోలుకున్నాడు, ఇక మళ్లీ జనం మధ్యకు వస్తాడని అనుకుంటుండగా ఈ హఠాత్పరిణామం సంభివించింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ఆయన స్వగ్రామం. అక్కడే అంత్యక్రియలు జరుగుతాయి. ఈ వివరాలు తెలియాల్సి ఉంది.
బిసి ఉద్య మానికి తీరని లోటు
ఆయన మృతి బిసి ఉద్యమానికి తీరని లోటు అని మిత్రులు భావిస్తున్నారు. బిసి యువకుల్లో సామాజిక న్యాయ చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన రాష్ట్రమంతా తిరిగేవారు. సమావేశాలు, రౌండ్ టేబుల్స్ నిర్వహించారు. చర్చల్లో పాల్గొన్నారు. ఆయనది రాజీలేని ధోరణి. తెలంగాణలో అగ్రకులాల అధిపత్యం పోయి సామాజిక న్యాయ వెల్లివిరయాలని, దోపిడికి గురవుతున్న కులాలకు రాజకీయ సాధికారీకరణ సాధించాలని ఆయన నిరంతం కృషి చేశారు.
ఇండియన్ ఇన్ఫపర్మేషన్ సర్వీసెస్ కు ఎంపికయినా ఆయన దాన్ని వదిలేసి తెలంగాణలో పనిచేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. ఆయన మంచి టీచర్ అని కూడా పేరుంది.ఐఐఎస్ అధికారిగా ఉన్నపుడు నాటి ప్రణాలికా సంఘంలో, ప్రెస్ ఇన్ ఫర్మేష్ బ్యూరోలలో పనిచేశారు.
ఫ్రొఫెసర్ ఐలయ్య సంతాపం
ప్రొఫెసర్ ప్రభంజన మృతి పట్ల ప్రముఖ దళిత బహుజన వాది ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ విచారం వ్యక్తం చేశారు. "పిన్నవయసులోనే ప్రభంజన్ మృతి చెందడం ఒబిసి ఉద్యమానికి,తెలంగాణ మేదో సమాజానికి తీరని లోటు. కాలేజీ రోజుల నుంచి నిరంతం సాంఘిక న్యాయం కోసం పోరాడుతూ వచ్చాడు. ఆయన పోరాటాన్ని తెలంగాణ సమాజం ఎపుడు గుర్తుంచుకుంటుంది," అని ప్రొఫెసర్ ఐలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మిత్రులు ఆవేదన
ప్రభంజన మృతి పట్ల పలువురు మిత్రులు, ఉద్యమ సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.
"ప్రభంజన్ యాదవ్ తెలంగాణ రాష్టృ సాథనకోసం ఎనలేని పోరాటం చేసాడు చివరికి డిల్లిలో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వొదిలేసారు ఈ దోరల, రెడ్డీల భూస్వాముల పెత్తనం చెల్లదు అంటు సామాజిక తెలంగాణ సాథన సమితి తో మరో ఉద్యమం మొదలు పెట్టారు అందులో భాగంగా పూలే అంభేడ్కర్ జాతరలో మేము కిలక పాత్ర వహించాము. జిల్లాలు తిరిగాము కాని సామాజిక తెలంగాణను సాథించుకోలేకపోయినాము. ఈ ఆశయం నెరవేరే దాకా పోరాడుతాం. నీ ఆశయం నెరవేరాలని కోరుతున్నాం," ఉద్యమ మిత్రుడు , డోలక్ యాదగిరి చెప్పారు.
బిసి సమాజ క్షేమమే ధ్యేయం
"బిసి సమాజం కోసం అహర్నిశలు పాటు పడి, చివరి శ్వాస వరకు బీసీ ప్రజల కోసం పరితపించిన వ్యక్తి ప్రొ. ప్రభంజన్ యాదవ్. ఈ రోజు ఉ 6 గంటలకు తుది శ్వాస విడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ, బీసీ యునైటెడ్ ఫోరం (రాజకీయ వేదిక )పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం," అని వడ్డేపల్లి మనోహర్ పేర్కొన్నారు.
ఆనంద భాస్కర్ సంతాపం
"ఆచార్య ప్రభంజన్ యాదవ్ అకాల మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. సామాజిక ఉద్యమకారుడు సామాజిక శాస్త్రవేత్త పాత్రికేయుడు, రచయిత అంతకు మించి పాలకుర్తి పౌరుషం బమ్మెర, గూడూరు కీర్తి పతాక చౌడవరపు విశ్వనాధం, చుక్కా రామయ్య గారల వలె, గూడూరు మట్టి బిడ్డ అని మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
"భావజాల, జీవన సరళి వైరుధ్యాలు కలగలిసినా, చెరగని ఆత్మీయత నాకు, ప్రభంజన్ కు మధ్య గాఢమైనది.
విభేదించిన అంశాల మీద కూడా ఆయన గోష్ఠి జరిపితే, ఆయన పిలువ కుండా ఉండలే. నేను ఆయన గోష్ఠి కి పోకుండా ఉండలేదు. ప్రభంజన్ ను క్యాన్సర్ కబళించింది అని ఇప్పుడే తెలిసింది," అని ఆయన అన్నారు.
ఢిల్లీలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత గొప్పదని కేసీఆర్ అన్నారు.
కెసిఆర్ విచారం
తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మరణం పట్ల.. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
"మహాత్మా ఫూలే,అంబేద్కర్ సామాజిక తాత్విక ఆలోచనా దృక్పథంతో, బీ సీ కులాల హక్కులు, పురోగతి కోసం నిత్యం తపించే ప్రభంజన్ యాదవ్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప తాత్వికున్ని, సామాజిక ఉద్యమకారున్ని కోల్పోయింది," అని అని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తిరునహరి శేషు సంతాపం
ప్రభంజన్ యాదవ్ గారు బీసీ సమాజానికి చేసిన సేవలు మరువలేనివని కాకతీయ విశ్వవిద్యాలయీనికి డాక్టర్ తిరునహరి శేషు పేర్కొన్నారు.
"ఒక బలమైన బీసీ ఉద్యమ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు ఆ ప్రయత్నంలో తన భాగస్వామ్యం అనిర్వచనీయమైనది.ప్రభంజన్ గారి అకాల మరణం బీసీ ఉద్యమాలకు వారి కుటుంబానికి తీరనిలోటు. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను," అని డాక్టర్ శేషు పేర్కొన్నారు.