‘మా ఒత్తిడికే ప్రధాని తలొగ్గారు.. కులగణనకు ఓకే చెప్పారు’

జనగణనతో కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలి. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని రేవంత్ తెలిపారు.;

Update: 2025-05-01 06:42 GMT

దేశమంతా కులగణన చేపట్టడానికి కేంద్రం ఓకే చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కాగా కులగణను.. జనగణనతో కలిపి చేస్తామని చెప్పారు. 2021లో కరోనా కారణంగా జనగణన వాయిదా పడిందని తెలిపారు. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రం చాలా మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టామని, ఇప్పుడు ఇది యావత్ దేశానికి బ్లూప్రింట్‌లా మారిందని చెప్పారు.

‘‘జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారు.. కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారు. రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో రెండు తీర్మాననాలు చేసి కేంద్రానికి పంపాం. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపాం. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టాం. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారు’’ అని చెప్పారు.

‘‘కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జనగణనతో కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలి. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలి. ఇందుకు కేంద్ర మంత్రులతో కూడిన కమిటీతో పాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాలి. మేం కులగణన చేపట్టే క్రమంలో విధి విధానాలు రూపొందించి ప్రజల ముందు పెట్టాం. తెలంగాణలో మేం 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించాం. కులగణనలో మేం అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశాం’’ అని తెలిపారు.

‘‘ఎక్కడా మా పార్టీ కార్యక్రమంలా చేయలేదు. అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన పూర్తి చేశాం. అందుకే కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కులగణనలో దేశానికి తెలంగాణ ఓక మోడల్ గా నిలిచింది. కులగణనపై కేంద్రంతో మా అనుభవాన్ని పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే మా సంకల్పం. రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం కులగణన చేసించూపించింది. మమ్మల్ని విమర్శించే బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నా. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదు?’’ అని ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే మా పై విమర్శలు చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులలో అసూయ, అసంతృప్తి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోంది. తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్. మొన్నటి వరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడింది. మా ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ముందుకు వచ్చింది. బీజేపీ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరాల్సిన పరిస్థితి’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News