ఎస్సీ వర్గీకరణపై కీలక ముందడుగు.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.;

Update: 2025-03-06 14:29 GMT

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా వర్గీకరణ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత రావడం కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించి నివేదిక అందుకుంది. నివేదిక ఆధారంగా ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లులపై కూడా కీలకంగా చర్చ జరిగింది. ఇందులో మంత్రులు కొన్ని సవరణలు చెప్పారని సమాచారం. కాగా మొత్తానికి ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్ర వర్గం ఆమోదం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎస్సీ ఉపకులాల్లో ప్రతి ఒక్క కులం వారికి న్యాయం జరిపించడమే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రధాన లక్ష్యమని, దానికి గండి పడకుండా ఉండేలా ఈ వర్గీకరణ బిల్లును రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ బిల్లు విషయంలో భవిష్యత్తులో కూడా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకూడదని, అంత పకడ్బందీగా బిల్లును సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఈ బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో నేపథ్యంలోనే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్టు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్‌ సవరణ బిల్లును కూడా క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నాయని, దీనిని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరుతున్నవారు కూడా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రశ్నిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇటీవల ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఈ నివేదికలో పలు మార్పులను ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ కమిషన్ కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అనుకున్న విధంగా నివేదికను పునఃపరిశీలించడానికి, పలు మార్పులు చేయడంపై అభిప్రాయాలు స్వీకరించడం కోసం కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పెంచింది ప్రభుత్వం.

Tags:    

Similar News