Telangana | కేంద్ర బడ్జెట్‌లో వివక్షకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన బాట
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.;
By : The Federal
Update: 2025-02-02 03:43 GMT
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష కు నిరసనగా ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేయనుంది.ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు , డీసీసీలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగం తో పాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొనాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేయాలని నిర్ణయించారు.
కేంద్రం తెలంగాణకు అన్నీ రంగాల్లోనూ తీరని అన్యాయం చేసింది. ఏ రంగానికి కూడా ఆశించిన మేర నిధులు కేటాయించకుండా వివక్ష చూపించిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
- హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్ డీ)కి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.ఎన్ఐఆర్ డీకి 2024-25 వ సంవత్సర బడ్జెట్ లో రూ.70 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. కానీ ఈ కేంద్రానికి నిధులు విడుదల చేయలేదు.
- ములుగులోని గిరిజన యూనివర్శిటీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. రెండు బీఏ కోర్సులతో తాత్కాలిక భవనంలో నడుస్తున్న ఈ యూనివర్శిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు.
- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆశించిన మేర తెలంగాణకు నిధులు కేటాయించలేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం పట్టించుకోలేదు
- వరంగల్, కొత్తగూడెం,ఆదిలాబాద్, రామగుండం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు బడ్జెట్ లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. బీహార్ రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి బడ్జెట్ లో నిధులిచ్చిన కేంద్రం తెలంగాణలోని నాలుగు విమానాశ్రయాలను విస్మరించింది.
- తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టింది.నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపించింది.కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది.
- కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్‌లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించింది.
- కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర సహాయ పథకాలకు కేటాయింపు గతేడాది రూ. 4,15,356 కోట్ల నుంచి రూ. 5,41,850 కోట్లకు పెంచారు.
- తెలంగాణ రాష్ట్రం సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. రైతులను అర్థికంగా బలోపేతం చేయడంలో ఈ బడ్జెట్ వైఫల్యం చెందింది.
- తెలంగాణ రాష్ట్రం దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది.కేంద్రం ప్రకటించిన 3 ఏఐ కేంద్రాల స్థాపనలో తెలంగాణను పూర్తిగా విస్మరించింది.
- కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి రాష్ట్రాల హక్కులను విస్మరించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం ఇవ్వ లేదు.
- మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను మూసీకి తరలించేందుకు ఉద్ధేశించిన గోదావరి-మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు రూ.7,440 కోట్లు కావాలని అడిగినా కేంద్రం నిధులివ్వలేదు.
- హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు రూ.24,269 కోట్లను కేటాయించాలని రాష్ట్రం కోరినా కేంద్రం కనికరించలేదు.
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60 నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా బడ్జెట్ లో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.
- ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డకు నిధులు ఇవ్వాలని రాస్ట్రం ప్రతిపాదించినా, పైసా కూడా విదల్చలేదు.
- హైదరాబాద్ తోపాటు 27 మున్సిపాలిటీల్లో సీవరేజి నెట్ వర్క్ కోసం రూ.17,212 కోట్లు కావాలని రాష్ట్రం అడిగినా, కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు.
-బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు.
- నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లకు బడ్జెట్ కేటాయింపులు లేవు.