Telangana Crime Report |పెరిగిన నేరాలు,డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో నేరాల సంఖ్య పెరిగింది. నేరాలు పెరిగినా శాంతిభద్రతలు మాత్రం నియంత్రణలోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ వెల్లడించారు.

Update: 2024-12-29 09:50 GMT

కాలగమనంలో కలిసి పోనున్న 2024 వ సంవత్సరం తెలంగాణలో నేరాల సంఖ్య పెరిగిందని వెల్లడైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87 శాతం నేరాలు పెరిగాయి.ఈ ఏడాది రాష్ట్రంలో 2,34,158 కేసులు నమోదయ్యాయి.

- ఈ ఏడాది రాష్ట్రంలో 856 హత్యలు, 58 దోపిడీలు, 703 దొంగతనాలు, 1525 కిడ్నాప్ లు, 2,945 అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. సంవత్సరం మొత్తం 16,92,173 ఫిర్యాదులు డయల్ 100కు రాగా, వీటిపై పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

సైబరాబాద్ లో నేరాలు అధికం
హైదరాబాద్ మహా నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో అధిక నేరాలు సైబరాబాద్ పరిధిలో జరిగాయి.సైబరాబాద్ లో 15,360 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 33,618 సైబర్ నేరాలు జరిగాయి. తెలంగాణలో సైబర్ నేరాల శాతం 43.33 శాతం పెరిగింది. సైబర్ నేరాల్లో రూ.180 కోట్లను రీఫండ్ చేయించారు. మరో రూ.247 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. మోసాలకు పాల్పడిన 1800 వెబ్ సైట్ యూఆర్ఎల్ లను పోలీసులు బ్లాక్ చేయించారు.

ఈ ఏడాది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో పోలీసులు ముందడుగు వేశారు. రూ.142.95 కోట్ల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని 4,682 మంది నిందితులను అరెస్టు చేశారు.డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. రూ.142 కోట్ల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు 41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. రూ.10వేల ఐఎంఈఏ నంబర్లను బ్లాక్ చేయించారు. సెల్ ఫోన్ల చోరీలు అధికంగా జరగడంతో పోలీసులు చోరీ అయిన సెల్ ఫోన్లను రికవరీ కూడా చేశారు.

మహిళలపై పెరిగిన నేరాలు
ఈ ఏడాది మహిళలపై నేరాలు పెరిగాయి. 4.7 శాతం కేసులు పెరిగాయి. అత్యాచార కేసుల్లో నిందితులపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ను పోలీసులు తెరిచారు. 99 శాతం అత్యాచార కేసులు తెలిసిన వారే చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

మైనర్లకు వాహనాలివ్వొద్దు
‘‘పిల్ల‌ల స‌ర‌దా కోసం మైన‌ర్ల‌కు వాహ‌నాలు ఇస్తున్నారా? మీరు చేసే ప‌ని మీతో పాటూ ఇత‌రుల్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంది. మైన‌ర్లు వాహ‌నాలు న‌డిపి ప్ర‌మాదాల‌కు కార‌కులైతే ఆ త‌ల్లిదండ్రులదే బాధ్య‌త‌. వారు కూడా జైలుకు వెళ్లక త‌ప్ప‌దు’’అని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.


Tags:    

Similar News