సిట్ చేతికి ‘సృష్టి’ కేసు..

కీలక విషయాలు వెల్లడించిన హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్.;

Update: 2025-08-12 10:38 GMT

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు సిట్ చేతికి వెళ్లింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రోజుకో కోణం వెలుగు చూస్తున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. మొత్తం ఎనిమిది ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు చెప్పారు. ఒక కేసులో బాధితులకు సృష్టి యాజమాన్యం చనిపోయిన బిడ్డను చూపారని వివరించారు. మరో కేసులో రూ.15 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఈ లావాదేవీల పరిశీలన కోసం డాక్టర్ నమ్రత బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశాం. గైనకాలజీ డాక్టర్ సూరి తన భార్య పేరుపై ఉన్న లైసెన్స్ నంబర్, లెటర్ హెడ్స్‌తో అక్రమాలు చేశారు. ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశాం అని రష్మీ వివరించారు.

‘‘సికింద్రాబాద్‌లో సృష్టి సెంటర్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు. ఈ సెంటర్‌కు అనుమతులు రద్దయి చాలా కాలమైంది. ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్‌ కాగా.. మరికొందరిని సబ్‌ ఏజెంట్లుగా నియమించుకొని నెట్‌వర్క్‌ను విస్తరించారు. విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యుల్లత, వైద్యులు రవి, ఉష పనిచేశారు. ఈ కేసులో సరోగేట్‌గా, అండదానం ఇచ్చే వారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారు. ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్స్‌ కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు. 9 నెలల పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసీ కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు. మగ బిడ్డకు రూ.4.5 లక్షలు, ఆడబిడ్డకు రూ. 3లక్షల ధర నిర్ణయించారు. ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమతులు ఉన్న వాటినే సంప్రదించాలి’’అని డీసీపీ రష్మీ పెరుమాళ్‌ సూచించారు.

Tags:    

Similar News