కేంద్ర సంస్థకు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు..

ధరణి పోర్టల్‌ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించింది.

Update: 2024-10-22 07:09 GMT

ధరణి పోర్టల్‌ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ధరణి నిర్వహణ బాధ్యతల్లో కొంత కాలంగా మేధోమథనం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు ఈ బాధ్యతలను ఎన్ఐసీకే ఇవ్వాలని నిర్ణయించింది. ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ రైతన్నలతో పాటు సొంత భూమి ఉన్న ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు పడ్డారని, వీటిపై తమకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటికి కూడా ప్రజావాణిలో వస్తున్నఅనేక సమస్యలకు మూలం ధరణి పోర్టల్‌గా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ధరణి పోర్టల్‌ను గాడిన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో తొలి అడుగుగా నిర్వాహకులను మార్చినట్లు సమాచారం. అతి త్వరలోనే సమగ్ర భూ సర్వే చేపట్టయినా.. భూములను సరైన క్రమంలో వాటి అసలైన యజమానుల పేర్లతో రికార్డు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ముగిసిన గడువు

బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ నిర్వహణను ఇన్నాళ్లూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థ క్వాంటెలా చూసుకుంది. ఈ సంస్థ చేసుకున్న నిర్వహణ ఒప్పందం ఈ ఏడాది తొలి త్రైమాసికంతో ముగిసింది. కాగా కానీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకే ఇచ్చింది రెవెన్యూ శాఖ. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, టీజీటీఎస్ ఎండీతో పాలు పలువురు ఐఏఎస్‌లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్ఐసీ, సీజీసీ, టీజీటీఎస్ సంస్థల్లో దేనికి ఇవ్వాలి అన్న అంశంపై తరువుగా అధ్యయనం చేసి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సీల్డ్ కవర్‌లో తమ నివేదికను అందించాయి. కాగా ధరణి పోర్టల్ నిర్వహణను అతి తక్కువ వ్యయంతో చేపట్టడానికి ఎన్‌ఐసీ ఆసక్తి చూపుతూ ముందుకు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అటే మొగ్గు చూపింది. తాజాగా ఎన్ఐసీకే ధరణి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News